Government Lands Possession Cases :కరీంనగర్ అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో శివారు ప్రాంతాల్లో భూములకు రెక్కలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వ భూములను వెంచర్లుగా మారుస్తుండటంతో రేకుర్తి గ్రామం భూకబ్జాలకు నెలవుగా మారింది. నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు, రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబరు, విద్యుత్ మీటర్లు కేటాయిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ శివారు ప్రాంతం రేకుర్తిలోని సర్వే నెంబర్ 55లో 16 ఎకరాల భూమి రికార్డుల్లో ఉండగా, ఇప్పటికే 2 ఎకరాలు కబ్జాకు గురైంది.
గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రేకుర్తి 2019లో కార్పొరేషన్‌లో విలీనం అయింది. పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడే కబ్జాల పర్వం సాగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేములవాడకు చెందిన ఓ వ్యాపారికి లేని భూమిని ఉన్నట్లు కాగితాలు సృష్టించి, రూ.కోటి 37 లక్షలకు రేకుర్తి కార్పొరేటర్ భర్త కృష్ణగౌడ్ విక్రయించాడు. మోసం గ్రహించిన బాధితుడి ఫిర్యాదుతో విచారించిన సీపీ(CP)అభిషేక్ మహంతి కృష్ణగౌడ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరోవైపు 137వ సర్వే నెంబర్ ఎరికలగుట్టలో 42 ఎకరాల ప్రభుత్వ భూమిలోనూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు.
'ఇక్కడ ఉన్నట్టువంటి కొంత మంది ఎస్సీలకు పూర్వకాలంలో సేద్యానికి ఉపయోగపడే భూమి కొంత భాగమే వాళ్లకు కేటాయించారు. మిగతా భూమి 10 నుంచి పదిహేను మంది సుంకర వాళ్లకు గతంలో పట్టాలు ఇచ్చినట్లు ప్రభుత్వ రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇక మిగతా భూమికి హద్దు లేకుండా నచ్చిన విధంగా కబ్జాలు చేసుకున్నారు కొందరు'- డి.మారుతి, న్యాయవాది