Government Lands Occupied in Kadapa During YCP Government : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కడప నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేశారు. కడప నగరం చుట్టూనే 400 వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. వీటిలో 90 శాతం వైఎస్సార్సీపీ వారివే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆక్రమిత భూములపై విచారణ మొదలైంది. వైఎస్సార్సీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
40 వేల ఎకరాలు - కారు చౌకగా కొట్టేసిన వైఎస్సార్సీపీ నేతలు - assigned land scam in Jagan Ruling
కడప నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రభుత్వ భూములను నలుగురు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు రాబందుల్లా దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ పార్టీ కార్పొరేటర్లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అక్రమ వెంచర్లు వేసుకున్నారు. జగన్ సొంత జిల్లా వాసి అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, భూములను కబ్జా చేసి వెంచర్లు వేశారు. వీరికి కడపలో ఎన్నికల ముందు వరకు 4 ఏళ్ల పాటు పనిచేసిన తహసీల్దార్ శివరామిరెడ్డి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి అండ చూసుకుని శివరామిరెడ్డి ప్రతి వెంచర్‌లోనూ భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ప్రజాసంఘాలు ఇటీవల సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు లేఖను పంపాయి.
వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై పూర్తి వివరాలివ్వండి - అధికారులకు చంద్రబాబు ఆదేశం - White Paper on Land Grabs
కడప రింగ్ రోడ్డు చుట్టూ వైఎస్సార్సీపీ నాయకులు దాదాపు 500 ఎకరాలను ఆక్రమించి వెంచర్లు వేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమవశం చేసుకున్నారు. కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేశారు. కడప చుట్టూ వెలసిన 400 వెంచర్లలోని లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేవని సమాచారహక్కుచట్టం దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు ఒక్క కడపలోనే ఉన్నా చర్యలు తీసుకోకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.
"కడప శివారులోని మూలవంక వద్ద వైసీపీ నాయకుడు 52 ఎకరాల ప్రభుత్వ భూమికి అక్రమంగా ఎన్ఓసీ తెప్పించుకుని వెంచర్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కడప కార్పొరేషన్‌లో నంబర్-2గా పిలవబడే వ్యక్తి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపణలు వినిపించాయి. కడప రాజారెడ్డి వీధిలోని పోలీసు సంక్షేమం కోసం పెట్టిన స్థలాన్ని అక్రమంగా లీజుకు తీసుకుని హోటల్ నిర్మాణాలు చేపట్టడం అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. నలుగురు వైఎస్సార్సీపీ నాయకుల భూ పంపకాలలో వచ్చిన తేడాలతో ఏడాది కిందట శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని పట్టపగలు దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నాయకుల భూదాహానికి అడ్డే లేకపోవడంతో ఎవరూ ఎదురు చెప్పలేక పోయారు."- చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి
"కడపలో వైఎస్సార్సీపీ నాయకులు సాగించిన భూదందాను తీవ్రంగా పరిగణిస్తున్నాము. కార్పొరేషన్ అధికారులతో కమిటీ వేసి కబ్జాకు గురైన స్థలాలను వెలికితీసే పనిలో ఉన్నాం. తాజాగా గౌస్ నగర్‌లో ఒకటిన్నర ఎకరా ప్రభుత్వ భూమిని వైఎస్సార్సీపీ నాయకుడు కబ్జా చేశారని తేలడంతో విచారణ చేయాలని అధికారులను ఆదేశించాము. పోలీసు, జెడ్పీ స్థలాలను ఆక్రమించిన వారి భరతం పట్టేందుకు విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం."- మాధవీరెడ్డి, కడప టీడీపీ ఎమ్మెల్యే
కడపలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అప్పట్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది ఎన్నికల్లో కనిపించిందని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
వైఎస్సార్సీపీ పెద్దల భూదందా - బినామీల భరతం పట్టేందుకు సిద్ధమైన సర్కార్ - YSRCP Leaders Land Encroachment