Government has Started 100 Anna Canteens in First Phase :పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించింది. రాష్ట్రంలో ఈరోజు 99 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం అయ్యాయి. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు.
అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం :రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా వంద క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం గుడివాడలో అన్న క్యాంటీన్‌ను లాంఛనంగా ప్రారంభించగా మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు రిబ్బన్ కట్ చేశారు. మంత్రి లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట, మంగళగిరి పాత బస్టాండ్ వద్ద అన్నక్యాంటీన్లు ప్రారంభించారు. అనతంరం పేదలతో కలిసి క్యూలైన్‌లో నిల్చొని అల్పాహారం తీసుకున్నారు. అందరితో కలిసి తింటూ ఆహార నాణ్యత, రుచి అడిగి తెలుసుకున్నారు.
పేదలతో పాటు తింటూ రుచి, నాణ్యతపై ఆరా :గుంటూరు జిల్లా తెనాలిలోని మూడు అన్న క్యాంటీన్లను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి ప్రారంభించారు. పేదలతో కలిసి ఇరువురు నేతలు క్యాంటీన్‌లో ఆల్పాహారం తిన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని అన్న క్యాంటీన్‌కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిబ్బన్ కట్ చేశారు. పేదలకు అల్పాహారం వడ్డించి తాను అక్కడే అల్పాహారం తిన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో క్యాంటీన్ ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేదలకు భోజనం వడ్డించారు. నెల్లూరులో వేర్వేరు అన్న క్యాంటీన్లు స్థానిక ప్రజాప్రతినిధులు విడివిడిగా ప్రారంభించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏడు క్యాంటీన్ల ఫిష్ మార్కెట్ వద్ద పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఏసీ మార్కెట్ వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొత్త హాలు సమీపంలోని ఇందిరా భవన్ వద్ద క్యాంటీన్‌ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు.