Government Has Announced Ex Gratia Of Rs. 25 Lakhs On Died Families : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, నిమ్మల రామానాయుడు, అనిత, పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. అనంతరం అనగాని మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యా? సమన్వయా లోపమా? అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు.
మనసు తీవ్రంగా కలిచివేసింది : తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయాల పాలైన భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి ఆదేశించారు. తిరుమలలో తొక్కిసలాట ఘటనపై మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసుపార్థసారధి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కొల్లురవీంద్ర హామీ ఇచ్చారు.
దైవ దర్శనానికి వెళ్లి తొక్కిసలాట చోటు చేసుకోవడం, దాదాపు 40 మంది గాయాల పాలవ్వడం దురదృష్టకరమని అన్నారు. టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా ఆవేదన కలిగించిందని మంత్రి కొలుసుపార్థసారధి అన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కొలుసుపార్థసారధి ఆకాంక్షించారు.
'డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన' - క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో