Government Focus on Leased Lands in Telangana : ఆదాయ మార్గాలను పెంచే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. అందులో భాగంగా లీజు భూములపై సర్కార్ నజర్ పెట్టింది.రాబడుల పెంపు (Revenue Sources) దిశగా ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూశాఖతో చర్చించారు. గడువు ముగిసిన లీజు భూముల లెక్కలు తీయాలని సూచించారు. రెవెన్యూ శాఖకు ఉన్న ప్రధానమైన రాబడుల్లో భూముల లీజు ఒకటి. 1935 నుంచి లీజులు కొనసాగుతున్నాయి. గరిష్ఠంగా 30 ఏళ్లకు లీజు తీసుకున్న భూములకు అనుమతులు పొడిగించుకుంటూ వెళ్తున్నారు.
Telangana Government on Revenue Sources :ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పాటయ్యాక పలు విస్తీర్ణాలకు పొడిగింపులు ఇచ్చారు. ఇలాంటి భూముల్లో సింహభాగం మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీటి రుసుముల చెల్లింపు సక్రమంగా లేదు. రెవెన్యూశాఖ నోటీసులు జారీ చేసిన సమయంలో ఎంతో కొంత చెల్లించి చేతులు దులుపుకొంటున్న పరిస్థితులు ఉన్నట్లు సమాచారం.
ఆదిలాబాద్లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల పంజా.. అధికారుల అండ..!
దస్త్రాల్లో ఒకలా క్షేత్రస్థాయిలో మరోలా :వాణిజ్యం, ప్రజాసేవ, ఇతర ఉపయోగాలకు భూములు తీసుకున్నట్లు రెవెన్యూ దస్త్రాల్లో నమోదై ఉంది. కానీ వాటిని వినియోగిస్తున్న అవసరాలు వేరుగా ఉన్నాయని రెండేళ్ల కిందట లీజు భూముల వివరాల సేకరణలో రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. రెవెన్యూశాఖ లీజుకు ఇచ్చిన భూముల్లో కొన్నిచోట్ల నివాసాలు వెలిశాయి. మరోవైపు సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో 2304 మంది గతంలో భూములను కౌలుకు తీసుకున్నారు.
Lease Lands in Telangana :ఒక్క సికింద్రాబాద్ పరిధిలోనే 1.50 లక్షల చదరపు గజాల భూమి లీజుదారుల చేతుల్లో ఉంది. కొన్నిచోట్ల ఆ భూమి చేతులు మారింది. పలువురు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది ఈ విషయాన్ని నిర్దారించారు. కొన్ని జిల్లాల్లో ఇలాంటి స్థలాలకు పట్టాలు జారీ అయినట్లు సమాచారం. భూముల విలువలు భారీగా పెరిగినందున లీజు ముగిసిన వాటిని వెనక్కితీసుకుని, ఇతర అవసరాలకు వినియోగిస్తారా? లేక మరోసారి లీజుకు (Lease Lands)ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.