Government Focus on IT in AP : ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా ఐదు సంవత్సాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ESDM), సెమీకండక్టర్, డేటా సెంటర్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీలను రూపొందిస్తోంది. వాటితో పాటు భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న కృత్రిమ మేధ (AI), డ్రోన్ పాలసీలను కొత్తగా తీసుకురాబోతోంది. వాటికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు పూర్తయింది.
Government Focus on Electronics Fields in AP :నూతన పారిశ్రామిక విధానంతో పాటు వాటిని కూడా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2021-24 ఐటీ పాలసీ మార్చి నెలతో ముగిసింది. సాధ్యమైనంత త్వరగా కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించడం ద్వారా ఐటీ రంగంలో సంస్థలను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పెట్టుబడుల ఆధారంగా కాకుండా సంస్థ కల్పించిన ఉపాధి లెక్కల ఆధారంగా ప్రోత్సాహకాలను అందించేలా నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. రాబోయే ఐదు సంవత్సరాలపాటు అమలులో ఉండేలా నూతన పాలసీని ప్రభుత్వం తీసుకురానుంది.
ఐటీలో ఏపీని బలంగా పునర్నిర్మించడం ఎలా? అందుకోసం ఏం చేయాలి? - pratidwani on IT Industry In AP
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐటీ రంగానికి ప్రాధాన్యం కల్పించకపోవడంతో ఆశించిన స్థాయిలో పురోగతి రాలేదు. దీంతో ఇప్పటికే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కొత్త కంపెనీలకు కేటాయించి, డిమాండ్‌కు అనుగుణంగా నూతన పార్కులను అభివృద్ధి చేయాలని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ (Millennium Towers)లో అందుబాటులో ఉన్న మూడు లక్షల చదరపు అడుగుల్లో 1,92,563 చ.అ.ఖాళీగా ఉంది. దాన్ని కొత్త కంపెనీలకు చ.అ. రూ.45కు కేటాయించాలని భావిస్తోంది.
సంస్థలకు భూములు కేటాయింపు :విజయవాడ ఏసీఈ అర్బన్ ఐటీ పార్కులో మరో 56,900 చ.అ. స్థలం కంపెనీలకు కేటాయించడానికి అందుబాటులో ఉంది. తిరుపతిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ-1)లో 12.87 ఎకరాలను పరిశ్రమలకు కేటాయించే వెసులుబాటు ఉందని గుర్తించింది. దీన్ని ఎకరా రూ.81 లక్షలకు కేటాయించాలని ప్రతిపాదన. ఈఎంసీ-2లో ఇంకా 72.4 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ డిక్సన్ టెక్నాలజీస్, వింగ్‌టెక్, టీసీఎల్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొప్పర్తి ఈఎంసీ-3లో ఇంకా 207.52 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. డిక్సన్ టెక్నాలజీస్, రిజల్యూట్, టెక్నోడోమ్, వర్చువల్ మేజ్ వంటి సంస్థలకు భూములు కేటాయించారు.
పాఠశాల స్థాయి నుంచే ఏఐ, ఐటీ :భవిష్యత్తులో ఏఐలో విస్తృత ఉపాధి అవకాశాలు వస్తాయన్న అంచనాతో పాఠశాల స్థాయి నుంచే ఏఐ, ఐటీకి సంబంధించి అవగాహన కల్పించడం, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం. దీని కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దడం. స్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ద్వారా ఏఐలో సాంకేతికంగా వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని భాగస్వామ్య పక్షాలను సమన్వయం చేయడం.