Godavari is Being Polluted with Garbage in Bhadrachalam :దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం కాలుష్యం బారిన పడుతోంది. చెత్త వేయడానికి స్థలం లేక పవిత్ర గోదావరి ఒడ్డునే కాల్చుతున్నారు. జల, వాయు కాలుష్యంతో రామయ్య సన్నిధి కాలుష్యపు కాటుకు గురవుతోంది. సమస్య పరిష్కారానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు జరగటం లేదు. సుదూర ప్రాంతాల నుంచి రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులు చెత్తను కాల్చిన పొగతో ఇబ్బంది పడుతున్నారు.
భద్రాచలాన్ని చెత్త సమస్య వేధిస్తోంది. పట్టణంలో సేకరించే చెత్తను గోదావరి కరకట్ట వద్ద వేసి ఆ తర్వాత కాల్చేస్తున్నారు. సుభాష్ నగర్, ముదిరాజ్ కాలనీ, రామాలయం సెంటర్, సూపర్ బజార్ సెంటర్ కాలనీల్లో ప్రజలు పొగ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి ఆలయం వాయు కాలుష్యంబారిన పడుతోందని పురోహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి కాలుష్యం : రాష్ట్ర విభజనకు ముందు ఎటపాకకు చెత్త తరలించేవారు. భద్రాచలానికి దూరంగా ఉందని ప్రస్తుతం గోదావరి కరకట్ట పక్కనే చెత్త పడేసి కాల్చేస్తున్నారు. ఆ వ్యర్థాలు కలవడం వల్ల గోదావరి కాలుష్యమవుతోంని దిగువ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆదర్శ్‌నగర్ కాలనీలోని 8 ఎకరాల్లో రీసైక్లింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.