Girls Missing Cases in AP : ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమ్మాయిల అదృశ్యాలు తల్లిదండ్రులను ఆందోళకు గురిచేస్తున్నాయి. చదువు, ఒత్తిడి ఇతరత్రా విషయాలు ఒక కారణమైతే అధిక శాతం మంది ప్రేమ మోజులో పడి ఇళ్ల నుంచి పారిపోతున్నారు. పరిణితి చెందని వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమనే తప్పటడుగు వేసి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ తరహా అదృశ్యం కేసులు ఎక్కువవడం కలవరపెడుతున్నాయి. దీంతో పోలీసు అధికారులకు తలనొప్పిగా మారింది.
గ్రామీణ ప్రాంతంవారే ఎక్కువ :
- ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంత బాలికలు ఎక్కువగా ప్రేమ మాయలో పడుతున్నారు. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లి అమాయకత్వంతో యువకుల ఆకర్షణకు లోనవుతున్నారు. కొద్దిరోజుల కిందట కర్నూలు మండలానికి చెందిన పదో తరగతి అమ్మాయి బనగానపల్లి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఓ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతని మాయమాటలు నమ్మి ప్రేమగా భావించి అతడితో వెళ్లిపోయింది. పోలీసులు కష్టపడి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలనీలో తల్లిదండ్రులు తలెత్తుకోలేక గ్రామం విడిచి వెళ్లిపోయారు.
- బాలికల అదృశ్యం ఉదంతాల్లో సెల్ఫోన్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు, కాలేజీల్లో ఉంటున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చదువును పక్కనబెట్టి మొబైల్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
- ఓ వైద్యుడి కుమార్తె ఓ అపరిచితుడి మాయలో పడింది. తన వ్యక్తిగత చిత్రాలు పంపింది. చివరికి అతను పెద్దమొత్తం డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడగా పోలీసులు ఆ బాలికను కాపాడారు.
- కర్నూలులో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి పెళ్లై పిల్లలున్న వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాలకు అతడు తిరిగి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు.
- ఆదోనికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న ఎమ్మిగనూరుకు చెందిన యువకుడి మాయ మాటలకు చిక్కింది. ఇద్దరూ కలిసి జమ్ముకశ్మీర్‌కు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేశారు. వారిద్దరూ హైదరాబాద్ వచ్చినట్లు సాంకేతిక పరిజ్ఞానంత గుర్తించారు. వారిని పట్టుకున్నారు. అమ్మాయిని విచారించిన తర్వాత తర్వాత యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అవగాహన సదస్సులు : అమ్మాయిల అదృశ్య ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు తమ పరిధిలోని స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జరిగిన ఘటనలు ఉదాహరణలుగా వివరిస్తూ ప్రేమ మాయలో పడితే భవిష్యత్త్ పరిణామాలు వివరించి అప్రమత్తం చేస్తున్నారు. మిస్సింగ్, పోక్సో ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కర్నూలులో ప్రభుత్వ బాలికల వసతిగృహాల్లో వారి భద్రతపై పోలీసులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.