Girlfriend Acid Attack on Young Man In Annamaiya District:బంధు మిత్రులతో కల్యాణ మండపం సందడిగా ఉంది. కాసేపట్లో వివాహ బంధంతో వధూవరులిద్దరూ ఒక్కటి కానున్నారు. ఇంతలో అనుకోకుండా ఓ యువతి దూసుకొచ్చింది. నాకు అన్యాయం చేసి మరో యువతిని పెళ్లి చేసుకుంటావా యాసిడ్, కత్తితో బీభత్సం సృష్టించి, దాడికి దిగింది. దీంతో పెళ్లి మండపం అంతా రణరంగంలా మారింది. అక్కడ ఏ జరుగుతుందో అర్థం కాక పెళ్లికి వచ్చిన బంధువులంతా షాక్ కు గురైయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నందలూరు మండలం రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా అనే వ్యక్తి తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ యువతి ఆరోపించింది. బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆమె అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసింది. దీంతో ఆదివారం నందలూరులో బాషా వివాహం జరగనుందని తెలుసుకొని నేరుగా వివాహం జరిగే షాదీ ఖానా మండపం వద్దకు వచ్చింది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
విజయవాడలో దారుణం - మందలించాడని వ్యాపారిని హత్య చేసిన యువకుడు - Vijayawada Kirana Shop Owner Murder
దీంతో తను తెచ్చుకున్న యాసిడ్, కత్తితో బాషాపై ఆ యువతి దాడికి యత్నించింది. అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయగా జరిగిన వాగ్వాదంలో వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్ పడింది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన బాషా కత్తితో ప్రియురాలిపై దాడి చేశాడు. దీంతో ఆ యువతి వీపు, భుజంపై గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని రాజంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరి మహిళలకు ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధరించారు. తమకు న్యాయం చేయాలని వధువు తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించగా స్టేషన్‌లో పంచాయితీ జరుగుతోంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మరో వైపు వరుడి ప్రియురాలు మీడియాతో మాట్లాడకుండా ఆమెను పోలీసులు నిర్బంధించారు.