CRDA Statement on Flood Situation: రాజధానికి వరద ముంపు అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై సీఆర్డీఏ మరోమారు వివరణ ఇచ్చింది. వరద రహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దటానికి సీఆర్డీఏ విస్తృతస్థాయిలో ప్రణాళికలు చేసిందని వెల్లడించింది. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్లు, నెదర్లాండ్స్ సంస్థ ఆర్కాడిస్ సంయుక్తంగా వంద ఏళ్ల వర్షపాతాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చారని స్పష్టం చేసింది. భవిష్యత్ లో నగర అభివృద్ధి ద్వారా వచ్చే రన్ఆఫ్తో పాటు వందేళ్ల కాలంలో 24 గంటల పాటు వర్షపాతం నమోదైతే ఎంత వర్షం కురుస్తుందో దాని ఆధారంగా నివేదికలు రూపొందించినట్టు స్పష్టం చేసింది.
అమరావతిలో ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుల వెడల్పు, లోతు పెంచడంతో పాటు పంపింగ్ స్టేషన్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. రాష్ట్ర జలనవరుల శాఖ రూపొందించిన వరద నిర్వహణ ప్రణాళిక డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక కమిటీ కూడా ఆమోదించినట్టు తెలియచేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎస్ఆర్ ప్రకారం రాజధానిలో వరద నిర్వహణ పనులు రూ. 2062.78 కోట్లతో అంచనా వేసినట్టు సీఆర్డీఏ స్పష్టం చేసింది.
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వరద నిర్వహణ నిపుణులు, వాతావరణ మార్పుల నిపుణులు ఈ వరద నిర్వహణ ప్రణాళికపై సంతృప్తి వ్యక్తం చేశారని సీఆర్డీఏ తెలియచేసింది. వరద పనులు, నగరాభివృద్ధిని 2019-24 మధ్య అమలు చేసి ఉంటే 25-30 శాతం తక్కువ ఖర్చుతోనే పనులు పూర్తి అయ్యేవని వెల్లడించింది. గత ఐదేళ్లలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో వరద పనులతో పాటు నగర అభివృద్ధి కూడా చేపట్టాలని నిర్ణయించినట్టు సీఆర్డీఏ వెల్లడించింది.
అమరావతి టవర్లకు మళ్లీ ఊపిరి - తొమ్మిది నెలల్లో మారనున్న రూపురేఖలు
గతంలో విజయవాడ వరదల సమయంలోనూ రాజధాని విషయంలో దుష్ప్రచారం జరిగింది. ఈ విషయంలో వైఎస్సార్సీపీ నేతల తీరుపై అమరావతి ఐకాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తునకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, రాజధానిపై విష ప్రచారం చేస్తారా అంటూ ఆ సమయంలో అమరావతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రాజధాని అమరావతి వరదముంపు ప్రచారంపై సీఆర్డీఏ వివరణ ఇచ్చింది.
మహానగరికి మహార్దశ - రూ. 2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వే లైన్ నిర్మాణం