సమాధిలోని ఓటర్లకు కుక్కర్లు, గోడ గడియారాలు - తమనే గెలిపించాలంటూ నేతల అభ్యర్థన Gifts to Died Voters: చనిపోయిన ఓటర్లకు తాయిలాలు సమర్పించి ఓబీసీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. మరణించిన వారి సమాధి వద్దకు వెళ్లి తమకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తిరుపతి జిల్లాలోని ఓబీసీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్లకు తాయిలాలుగా వంట కుక్కర్లు, గోడ గడియారాలు సమర్పించారు.
అదేంటి చనిపోయిన వ్యక్తులను ఓట్లు అభ్యర్థించడం ఏంటీ, వారు ఎలా ఓటు వేస్తారు అనుకుంటున్నారా. అదీ కాక చనిపోయిన తర్వాత ఓటర్లేంటీ ఓటు వేయడమేంటీ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీని పూర్తిగా చదవండి మీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సూధా యాదవ్ వినూత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
తప్పుల తడకగా ఓటరు జాబితా - వైసీపీ సానుభూతిపరులకు డబుల్ ఎంట్రీలు
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో నూతన ఓటర్ జాబితాలో మరణించిన వారి ఓట్లు తొలగించలేదని, శ్మశాన వాటికలో బడి సుధాయాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ప్రకటించిన ఓటరు జాబితాలో వారి పేర్లు తొలగించకపోవడంతో, ఓటరు జాబితాలో పేర్లున్న మృతుల సమాధులకు వినతి పత్రం అందించారు. అంతేకాకుండా గోడ గడియారాలు, వంట కుక్కర్లు సమాధుల వద్ద ఉంచి తనను గెలిపించాలని వ్యంగ్యంగా ప్రచారం నిర్వహించారు.
ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుధా యాదవ్ అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరణించిన వారి ఓట్లు అధికంగా ఉన్నాయని సుధా యాదవ్ ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి, పెద్ద సోదరుడు మరణించారని, అయినప్పటికీ వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో తొలగించకపోవడంపై సుధా యాదవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ ఓటరు పేరు 'దదదద', తండ్రి 'రరకత' - అధికార పార్టీ ఆత్మలకూ ఓటు హక్కు!
ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యేనే తన ఇంట్లో మృతుల ఓట్లను, తొలగించకుండా అలాగే ఉంచడం దేనికి సందేశమని నిలదీశారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి ఓటర్ల తుది జాబితా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"రాష్ట్రంలోనే అధికశాతం చంద్రగిరి నియోజకవర్గంలో చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి. అధికారులు వాటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి కాబట్టే, శ్మశానంలో సమాధులకు బహుమతులు అందించాం." - బడి సుధాయాదవ్, సమన్వయకర్త రాష్ట్ర ఓబీసీ ఫోరం
కొట్టొచ్చినట్లు కనిపించిన అధికారుల నిర్లక్ష్యం - తప్పుల తడకగా గుంటూరు జిల్లా ఓటరు జాబితా