తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో పలు హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం - ప్రజల ఆరోగ్యంతో చెలగాటం - Adulterated food in Hyderabad - ADULTERATED FOOD IN HYDERABAD

Expired Food in Restaurants : హైదరాబాద్ మహానగరంలో ఆహార ప్రియులకు ఇది చేదు వార్తనే. నగరంలోని చాలా హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది. నాణ్యత లేని ఆహారాన్ని, గడువు తీరిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది. గడువు తీరిన పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, బూజుపట్టిన మాంసాహారంతో బిర్యానీలు వండుతున్నారని, వంట గదుల్లో కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. 10 చోట్ల తనీఖీలు చేస్తే 4 చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.

Food Safety Violation in Hyderabad
Expired Food in Restaurants (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 10:31 PM IST

Food Safety Violation in Hyderabad :ప్రపంచ వ్యాప్తంగా చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్ మహానగరం, ఆహారం విషయంలో అబాసుపాలవుతోంది. భాగ్యనగరంలో ఆహార కల్తీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్​ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ ఆహార ప్రియులకు సుచి, శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించలేక చెడ్డపేరు తెచ్చుకుంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్, రాష్ట్ర ఆహార భద్రత విభాగం కమిషనర్ నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీలోని బృందాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేసి గత 30 రోజులుగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తనిఖీల్లో నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలోని డొల్లతనం బయటపడింది. 10 చోట్ల పరిశీలిస్తే కనీసం 3 చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలు, పాడైపోయిన ఆహారం కనిపించడం ఆహార భద్రతా విభాగం అధికారులను కంగుతినేలా చేసింది. అంతేకాకుండా 80 శాతం పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో గడువు తీరిన ఆహార పదార్థాలను, నాసిరకం వంట సామాగ్రిని వాడుతున్నట్లు గుర్తించారు. రుచికి తప్ప సుచి శుభ్రతలకు చాలా హోటల్స్, రెస్టారెంట్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని టాస్క్ ఫోర్స్ బృందాలు గుర్తించాయి.

వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలిచే బిర్యానీలో కూడా నాణ్యత రోజు రోజుకు తగ్గిపోతుంది. నాసిరకమైన పదార్థాలతోపాటు రసాయనాలతో కూడిన రంగులు కలపడం వల్ల చాలా చోట్ల బిర్యానీ కల్తీ అవుతున్నట్లు గుర్తించారు. తందూరి చికెన్, చికెన్ 65 లాంటి మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆహార భద్రతా విభాగం సూచిస్తోంది. వంట చేసే పరిసరాల్లో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, దుర్గందంతో కూడిన వంట గది పరిసరాలు, అపరిశుభ్రంగా వడ్డించే గిన్నెలు, వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు పారడం టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వల్లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు.

రిఫ్రిజిరేటర్లలో ప్యాకింగ్ లేకుండా మాంసాహారాన్ని నిల్వచేయడం, కోడి, మేక మాంసంతోపాటు శాఖాహారానికి అవసరమైన వాటిని పక్కపక్కనే నిల్వచేయడం, బూజిపట్టిన క్యారెట్లు, పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలు, గడువు తీరిన పాల ప్యాకెట్లు, లేబుల్స్ లేని ఆహార పదార్థాలు ఎక్కువగా కనిపించాయి. వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్​లలో నిల్వ ఉంచడం, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కలిపి ఇస్తున్నట్లు గుర్తించారు.

పలు హోటల్స్ & రెస్టారెంట్​లో :పంజాగుట్ట షాన్ బాగ్, చట్నీస్, జూబ్లీహిల్స్​లోని ఆరా కేఫ్, ఇన్ఫూజియన్ బార్, కొంపల్లి మినర్వా హోటల్, బార్కస్ ఇండో అరబిక్ రెస్టారెంట్, బేగంపేట ఐటీసీ కాకతీయ, మ్యారీగోల్డ్, కూకట్ పల్లిలోని పద్మరంగ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కృతుంగ రెస్టారెంట్, ఉప్పల్ పిస్తా హౌజ్, శరత్ సిటీ మాల్​లోని ఫైర్ ప్లై రెస్టారెంట్, కోఠిలోని గోకుల్ ఛాట్, అమీర్​పేట మెట్రో స్టేషన్​లోని రత్నదీప్ రిటైల్ దుకాణం, జంబో కింగ్ బర్గర్, కేఎఫ్ సీ, లక్డీకపూల్​లోని రాయలసీమ రుచులు, షాగౌస్ రెస్టారెంట్, ఉప్పల్ క్రాస్ రోడ్​లోని సాయి బృందావన్ ప్యూర్ వెజ్ హోటల్, సోమాజిగూడలోని కృతుంగ రెస్టారెంట్ ఇలా అనేక ప్రాంతాల్లో ఆహార భద్రత విభాగం టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

నాణ్యత లేని ఆహారాన్ని, కల్తీ ఆహార పదార్థాలను గుర్తించి 24 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరికొంత మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి జరిమానాలు విధించారు. నగరంలో ఆహార కల్తీకి, నాణ్యతకు సంబంధించి జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ విభాగానికి రోజుకు 100కుపైగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిలో ఎక్కువగా శేరిలింగంపల్లి జోన్ నుంచి రావడం గమనార్హం. ఐటీ కారిడార్​లోని ఐటీ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆహార భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు. ఆన్​లైన్​లో ఆర్డర్ చేసే ఆహార పదార్థాలతోపాటు సమీపంలోని హోటల్స్​లో నాణ్యత ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.

కల్తీ ఆహారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా :వాటిపై దృష్టి సారించిన టాస్క్ ఫోర్స్ బృందాలు, నగరంలోని కీలకమైన ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యజమానులను హెచ్చరిస్తూ భారీగా జరిమానాలు విధిస్తున్నారు. నాణ్యతలేని ఆహారాన్ని అక్కడిక్కడే చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. కల్తీ అనుమానం ఉన్న వాటి శాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది 14 వేల 889 నమూనాలు సేకరించగా వాటిలో 3 వేల 809 నమూనాలు సేకరించిన హోటళ్లకు నాణ్యత మెరుగుపర్చుకోవాలని సూచించారు. 2 వేల 534 శాంపిళ్లు నాణ్యత లేదని గుర్తించారు. 311 ఆహార నమూనాల్లో భారీగా కల్తీ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ సారి తనిఖీల్లోనూ భారీగానే శాంపిల్స్ సేకరిస్తున్న అధికారులు, కల్తీ ఆహారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

పాడైపోయిన పండ్ల నుంచి జ్యూస్ - లేబులింగ్‌ లేకుండా ధనియాల పొడి - Food Safety Officers Checking

తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం! - ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి - Food Adulteration in Telangana

ABOUT THE AUTHOR

...view details