తెలంగాణ

telangana

ETV Bharat / state

మేయర్ విజయలక్ష్మి రాజీనామాకు బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల డిమాండ్ - అర్ధాంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం - GHMC Council Meeting - GHMC COUNCIL MEETING

GHMC Council Meet : ప్రజా సమస్యలపై కార్పొరేటర్ల నిరసనలతో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. పార్టీ ఫిరాయించిన మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుపట్టగా తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం, సభలోనే ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం, ప్లకార్డులు చించివేతతో ఎజెండాలోని ఏ అంశాన్ని చర్చించకుండానే మేయర్ విజయలక్ష్మి సభను వాయిదా వేశారు.

GHMC Council Meeting
GHMC Council Meeting (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 12:00 PM IST

Updated : Jul 6, 2024, 6:44 PM IST

BRS Leaders Concerns in GHMC Council Meeting: గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ తొమ్మిదవ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. ప్రజా సమస్యలపై కార్పొరేటర్ల నిరసనతో సభను నాలుగు సార్లు వాయిదా వేసిన మేయర్ విజయలక్ష్మి చివరకు సభను అర్థాంతరంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాజీ మంత్రి తలసాని, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, గ్రేటర్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమిషనర్ ఆమ్రపాలితో పాటు ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు హాజరయ్యారు.

సభ ప్రారంభమైన 5 నిమిషాలకే మేయర్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. పార్టీ ఫిరాయించిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోడియం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగా బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఇటీవల మరణించిన కార్పొరేటర్లకు సంతాపం తెలుపకుండా నేరుగా మేయర్ ఎలా ప్రసంగిస్తారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేయడంతో మేయర్ మరోమారు సభను వాయిదా వేశారు.

కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి - Lok Sabha Elections 2024

ఐదు నిమిషాల తర్వాత ప్రారంభమైన సభలో ఎమ్మెల్సీ వాణిదేవి బీఆర్ఎస్ తరపున కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ప్రకటించారు. ఎర్రగడ్డ ఎంఐఎం కార్పొరేటర్ సబీనా బేగం, కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత కౌన్సిల్‌ ఎజెండా వారీగా చర్చను ప్రారంభించగా బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు మరోమారు సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినా డివిజన్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కేటాయించిన నిధులు కూడా ఆపేశారని, అధికారుల చుట్టూ తిరిగితే మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి లేఖ తీసుకురావాలని కోరుతున్నట్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ కవిత సభ దృష్టికి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది.

అధికారుల తీరుపై బీఆర్​ఎస్ ధ్వజం : టీ విరామం తర్వాత ప్రారంభమైన సభలో ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని వరద నీరు, తాగు నీటి సమస్యలపై బీజేపీ తమ వాణి గట్టిగా వినిపించే ప్రయత్నం చేసింది. జలమండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో తాగునీరు కలుషితం అవుతుందని, సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కౌన్సిల్ సమావేశానికి ఎలా గైర్హాజరు అవుతారని మేయర్​ను నిలదీశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం పోడియం వద్దకు వెళ్లి అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. జోక్యం చేసుకున్న కమిషనర్ ఆమ్రపాలి సమాధానం చెప్పేందుకు యత్నించినా పట్టించుకోకుండా తమ నిరసనను కొనసాగించారు.

బీజేపీ కార్పొరేటర్ల చేతుల్లో ఉన్న ప్లకార్డులపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగింది. దీంతో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య సభలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్పొరేటర్ల వ్యవహార శైలిపై మండిపడ్డ మేయర్ విజయలక్ష్మి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం తీరుపై బీఆర్ఎస్, బీజేపీ ఎక్స్ అఫిషియో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి, మేయర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే జీహెచ్ఎంసీపై సమీక్షించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తర్వాత పెట్టిన కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యలపై ఒక పూట చర్చ లేకుండానే అర్థాంతరంగా ముగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

నేడు జీహెచ్​ఎంసీ కౌన్సిల్ సమావేశం - మేయర్​పై అవిశ్వాస తీర్మానం యోచనలో బీఆర్​ఎస్!​ - GHMC Council Meeting

Last Updated : Jul 6, 2024, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details