GHMC Mayor Vijayalakshmi Inspected Hotels : హైదరాబాద్‌లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్లో అధికారులతో కలిసి మేయర్ తనిఖీలు చేపట్టారు. హోటల్లోని కిచెన్‌ను పరిశీలించిన మేయర్ అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, జిడ్డుకారుతున్న వంట సామాగ్రి, చాలా రోజులుగా ఫ్రిజ్‌లో నిల్వ ఉండి కుళ్లిపోయిన చికెన్, మటన్ చూసి హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆహార భద్రత చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :డ్రైనేజీ పైపులైన్ పక్కనే కిచెన్ ఉండటమేంటని ప్రశ్నించారు. కిచెన్‌లో ఉన్న ఆహార పదార్థాలు, మాంసం నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తక్షణమే ఆ రెస్టారెంట్‌ను మూసివేయాలని అధికారులకు సూచించారు. నాణ్యత లేని ఆహారాన్ని, కల్తీ చేసి విక్రయిస్తున్న రెస్టారెంట్లు, హోటల్స్, వీధి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవని మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు.
ఆహార భద్రతలో చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేయవద్దని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆహార భద్రతా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మేయర్, నగరంలో ఇటీవల వెలుగు చూసిన ఘటనపై చర్చించారు.