GHMC to KBR Park Surrounding Junctions Development :హైదరాబాద్ వాసులను నిత్యం ఇబ్బంది పెట్టే ట్రాఫిక్ సమస్యను తొలగించేలా జంక్షన్ల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తొలిదశలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 కూడళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దబోతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్‌మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ ప్రాజెక్టులో భాగంగా రూ.826 కోట్లతో జంక్షన్ల డిజైన్లకు సర్కార్ ఆమోదం తెలిపింది.
2 ప్యాకేజీలుగా : పనులు చేపట్టనున్నారు. సవ్య దిశలో అండర్‌పాస్‌లు, అపసవ్య దిశలో పైవంతెనలు నిర్మించబోతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో రోడ్ నెంబర్-45 జంక్షన్, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ప్రగతి పనులు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.
హైదరాబాద్‌లో చెత్త శుద్ధి కేంద్రాలపై జీహెచ్ఎంసీ కసరత్తు - జవహర్‌నగర్‌పై తగ్గనున్న ఒత్తిడి - Ghmc Planning To Dumping Yards
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో ఎటువైపు వెళ్లాలన్న గంటల కొద్ది సమయం పడుతుంది. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్‌ను కేంద్రంగా చేసుకొని చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేస్తూ అన్నివైపులా సులువుగా ప్రయాణించేలా ప్రణాళికలు తయారుచేశారు. వాటికి ఆమోదం లభించడంతో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గమ్యాన్ని చేరుకోవచ్చు.
రెండు వరుసల్లో అండర్‌పాస్‌లు : జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్‌లో వై-ఆకారంలో అండర్‌పాస్ నిర్మించనున్నారు. రోడ్ నెంబర్-45 నుంచి కేబీఆర్‌పార్క్, యూసుఫ్‌గూడ వైపు అండర్‌పాస్ మార్గం ఉండనుంది. అలాగే కేబీఆర్‌పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్-36 వరకు 4 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వరకు 2 వరుసల అండర్‌పాస్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి పంజాగుట్ట వైపు 3 వరుస అండర్‌పాస్‌లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి.
చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట వైపు 3 వరుసల్లో రహదారి, ఫిల్మ్‌నగర్ వైపు రెండు వరుసల్లో అండర్‌పాస్ నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీలో రోడ్ నెంబర్-45 జంక్షన్‌లో ఓ అండర్ పాస్, మరో పైవంతెన రాబోతుంది. చెక్ పోస్టు నుంచి రోడ్ నెంబర్ 45 వైపు 2 వరుసల్లో పై వంతెన రానుంది. ఫిల్మ్‌నగర్ జంక్షన్‌లోనూ 2 వరుసల్లో అండర్ పాసులు, పైవంతెలను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం ఆమోద ముద్ర : మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద 2 వరుసల్లో అండర్‌పాసులు, పైవంతెన నిర్మించనున్నారు. క్యాన్సర్ ఆస్పత్రి నుంచి ఫిల్మ్‌నగర్ వైపు అండర్‌పాస్, ఫిల్మ్‌నగర్ నుంచి రోడ్ నెంబర్-12 వైపు 2 వరుసల్లో పైవంతెన అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్‌లోనూ అండర్‌పాసులు, పైవంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కేబీఆర్ పార్క్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 వరుసల్లో అండర్‌పాసులు, అలాగే అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్-10 వైపు రెండు వరుసల్లో పై వంతెన అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి.
ఆధార్‌లేనోళ్లతో అడ్డగోలు దందా - హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మాఫియా - Business with Illegal Migrants
నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు - సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం - REVANTH ON TRANSGENDER EMPLOYMENT