Garikapati Narasimha Rao Issue :ప్రముఖ ప్రవచనకర్త, ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు ప్రసంగాలను నిత్యం ఎన్నో లక్షల మంది యూట్యూబ్లో వీక్షిస్తుంటారు. వ్యంగ్యం, హాస్యం జోడిస్తూ కొనసాగే ఆయన వ్యాఖ్యానం అంటే ఎంతో మందికి అభిమానం. ఎంతో మంది ప్రేరణ పొందుతారు కూడా. అయితే, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో గరికపాటిపై జరుగుతన్నదంతా తప్పుడు ప్రచారం అని తాజాగా ఆయన టీమ్ స్పందించింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతోందని వెల్లడించింది. మేరకు గరికపాటి సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు.
ఇటీవల కొంతమంది వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో పరువు తీస్తున్నారని తెలిపారు. గరికపాటిపై వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్యదూరమని పేర్కొన్నారు. వేర్వేరు సందర్భాల్లో ఎవరెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటూ ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం జరుగుతోందని వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తామని గరికపాటి టీం హెచ్చరించింది. ఇకపై అలాంటి దుష్ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.