GANJA BATCH ATTACK ON YOUTH: 'నేను ఏ తప్పు చేయలేదు. మీ గంజాయి వ్యవహారం గురించి నేను పోలీసులకు చెప్పలేదు. నన్ను వదిలేయండి. కొట్టకండి' అంటూ వేడికున్నా ఆ గంజాయి బ్యాచ్ వినలేదు. మద్యం, గంజాయి మత్తులో ముళ్ల కర్రలు తీసుకుని చితకబాదారు. గాయాలు అయ్యేలా గంటల పాటు హింసకు గురి చేశారు. దగ్గర ఉన్న డబ్బూ లాక్కుని, మరికొంత కావాలంటూ బెదించారు. ఆపై కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఎలాగోలా స్నేహితుడికి సమాచారం ఇవ్వడంతో అతను కాపాడి ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ దారుణ ఉదంతం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది.
ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన షేక్ ఆరీఫ్ గ్యాస్ స్టవ్ రిపేర్ పనులు చేస్తుంటాడు. నెల రోజుల క్రితం ఎర్రగుంట్ల మండలంలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు ప్రొద్దుటూరు వచ్చి స్నేహితులను కలిసి వెళ్లేవాడు. ఈ క్రమంలో పట్టణానికి వచ్చిన ఆరీఫ్‌కు హౌసింగ్ బోర్డు కాలనీకి చెంది ఓ యువకుడు ఫోన్ చేయడంతో అతనితో కలిసి ఆటోనగర్ సమీపంలోని ఓ ప్రదేశానికి ఆదివారం వెళ్లాడు. అప్పటికే అక్కడ మరికొంతమంది యువకులు ఉన్నారు. కాసేపటికి శ్రీనివాసనగర్, సంజీవనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆరీఫ్‌పై దాడి చేయడం ప్రారంభించారు.
ఇటీవల చాపాడు మండలంలో గంజాయి పట్టుకున్న పోలీసులు, కొంతమంది యువకులను అరెస్టు చేసి చాపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆరీఫ్‌పై దాడి చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. గంజాయి గురించి ఆరీఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని అనుమానం పెంచుకున్న ఆ బ్యాచ్, పథకం ప్రకారం పిలిపించి దాడి చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వారి గురించి ఎవరీకీ చెప్పలేదని అతను వేడుకున్నా ఏ మాత్రం వినలేదు. గంజాయి, మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఆరిఫ్‌ను కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అతని వీపు, చెయ్యి ఇతర భాగాల్లో గాయాలు అయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకూ హింసకు గురి చేశారు.
దాడి చేసిన అనంతరం ఆరీఫ్‌ను మరో ఇద్దరు యువకులు బైక్‌పై ఎక్కించుకుని విజయవాడకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. మైదుకూరు దాటిన తరువాత ఓ శుభకార్యం జరుగుతుండటంతో అక్కడ మత్తులో చిందులేస్తూ కొద్దిసేపు గడిపారు. ఈ క్రమంలో ఫోన్ చేసి డబ్బులు తెప్పిస్తానని ఫోన్ తీసుకున్న ఆరీఫ్, ప్రొద్దుటూరులోని అతని స్నేహితుడు చిన్నాకు సోమవారం తెల్లవారుజాము సమయంలో ఫోన్ చేశారు. లోకేషన్ పంపి తాను ప్రమాదంలో ఉన్నానని, తిరిగి కాల్, మెసేజ్ చేయకుండా త్వరగా రావాలని కంగారుగా వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ పంపాడు.