Ganesh Agaman Celebrations :హైదరాబాద్లో వినాయక చవితి సంబురాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భక్తులు రెట్టింపు ఉత్సాహంతో గణేశ్ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి వేడుకగా వినాయకుని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మండపానికి కొంత దూరంలో భారీ వేదికను ఏర్పాటు చేసి ‘గణేశ్ ఆగమన్’ పేరుతో యువత భారీ స్వాగతోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గతంతో పోలిస్తే గణేశ్ ఆగమన్ ఉత్సవాలు ఈ సారి మరింత ఎక్కువగా కనిపించాయి. స్వాగత ఏర్పాట్లు కూడా అంబరాన్నంటాయి.
వేదికలతో స్వాగతం :నగరంలో ఈసారి లక్ష గణేశ మండపాలు వీధుల్లో కొలువుదీరుతాయని అంచనా. ఈసారి ఐదు అడుగులకు మించి ఎత్తుండే విగ్రహాలు 40వేలకుపైగా ఉంటాయని సమాచారం. వాటిని మండపాలకు తీసుకెళ్లేందుకు స్థానిక నేతలు, యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ఇతర ప్రముఖులు 'గణేశ్ ఆగమన్' కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం రాంనగర్ కూడలిలో భారీ స్టేజితో నిర్వహించిన స్వాగత వేడుకే అందుకు నిదర్శనం. డప్పులచప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణసంచా సందడి మధ్య యువత గణేశునికి స్వాగతం పలికారు. అంబర్‌పేట, గౌలిగూడ, నాంపల్లి, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఉత్సవాలు జరిగాయి.
చెరువుల వద్ద సందడి : నగరంలోని దాదాపు 50 చెరువుల వద్ద గణేశ నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నామని, మరిన్ని తాత్కాలిక కోనేరులను సిద్ధం చేస్తున్నట్లు బల్దియా పారిశుద్ధ్య విభాగం అధికారులు తెలిపారు.