Free Film Courses at Ramoji Academy of Movies: తెర మీద, తెర వెనుక వినోదాల రంగుల ప్రపంచంలో రాణించడానికి చాలా వేదికలున్నాయి. తపన, ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారు వెండితెర, బుల్లితెర, ఓటీటీల్లో సత్తా చాటొచ్చు. ఎన్నో సంస్థలు ఫిల్మ్ స్టడీస్ కోర్సులు అందిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ ఆధ్వర్యంలో రూపొందిన రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ (ఆర్‌ఏఎం)లో ఫిల్మ్ కోర్సును ఉచితంగా నేర్చుకొనే అవకాశాన్ని కల్పించారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఇవి తెలుసుకొని కోర్సులో చేరిపోండి.
తెలుగు రాష్ట్రాల్లో కళాకారులకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. సినిమాలు చూసి అభిమానించే వారు వాటినే ప్రాణంగా, తారలే లోకంగా బతికేవాళ్లు ప్రతి గల్లీకి ఒకరు ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది. నటులు, సాంకేతిక సిబ్బంది, సినిమాలో భాగమయ్యే అన్ని విభాగాల వారికీ అవకాశాలూ చాలా పెరుగుతున్నాయి. వేదికలు విస్తరించడంతో గతంలో మాదిరి ఒకే ఒక ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉంటే సంస్థలే నేరుగా సంప్రదించి, కటౌట్ పెడుతున్నాయి. వినోదాన్ని అందించే ఛానెళ్లూ పెరిగాయి. సీరియల్స్‌తో పాటు పలు కార్యక్రమాలు ఆదరణ పొందుతున్నాయి.
రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ : యాక్టర్, డైరెక్టర్, ఎడిటర్, ప్రొడక్షన్ మేనేజర్, డిజిటల్ ఫిల్మ్ మేకర్, స్టోరీ అండ్ స్క్రీన్‌ప్లే రైటర్ వీటిలో మీ అభిరుచికి తగ్గ కోర్సును పూర్తి ఉచితంగా ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ (ఆర్‌ఏఎం) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రతిభను ప్రోత్సహించి, నైపుణ్యం ఉన్నవారిని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఈ ఫిల్మ్ స్కూల్ నడుపుతున్నారు.
విద్యార్హతలు, వయసుతో పని లేదు : విద్యార్హతలు, వయసుతో పని లేకుండా ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. అలాగే నచ్చిన మాధ్యమం/భాష ఎంచుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, మలయాళం వీటిలో ఏదైనా మీ ఇష్టమే. ప్రతి దశలోనూ విద్యార్థుల ప్రోగ్రెస్ అంచనా వేస్తారు. ఇందుకోసం నేర్చుకున్న వాటిలో పరీక్ష నిర్వహించి ర్యాంకులను ఇస్తారు. దీంతో శ్రద్దగా నేర్చుకోవడానికీ అభ్యాస స్థాయి తెలుసుకోవచ్చు. అన్ని మాడ్యూళ్లూ విజయవంతంగా పూర్తి చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో పాటు అవకాశాలకు సంబంధించి సలహాలు, మెలకువలూ అందిస్తారు. మూడు దశల్లో (ఫౌండేషన్, శిక్షణ, ఇంటర్న్‌షిప్) ఏడాది పాటు కోర్సు కొనసాగుతుంది.
బహుళ విభాగాలు: ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్నో విభాగాలు పని చేయాల్సి ఉంటుంది. నటులు ఇందులో ఒక భాగం. అందువల్ల సత్తా చాటే అవకాశం నటులతో పాటు భిన్న విభాగాల్లో నైపుణ్యం ఉన్న అందరికీ దక్కుతుంది. స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్, సౌండ్ రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రీ ప్రొడక్షన్, పోస్టు ప్రొడక్షన్, లైటింగ్, మ్యూజిక్, వాయిస్ డబ్బింగ్ ఇలా ఎన్నో విభాగాల సమన్వయంతో చిత్రం రూపొందుతుంది. ఆ తర్వాతే థియేటర్లు, ఓటీటీలు, కంప్యూటర్లు, మొబైళ్లు, టీవీలలో సినిమా సందడి చేస్తుంది. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారు నైపుణ్యాలు, ఆసక్తి ప్రకారం నచ్చిన కోర్సులో చేరి సినిమాలో మీరూ ఒక భాగం కావచ్చు.
నటన : విభిన్న భావాలను ముఖ కవళికలతో నేర్పుగా ప్రకటించగలగాలి. నృత్యంపై పట్టు, మంచి రూపం అదనపు ఆకర్షణ. బాడీ లాంగ్వేజ్, వాచకంపై దృష్టి సారించాలి.