Different Types of Frauds in AP :మనిషి అత్యాశ, అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయగాళ్లు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. మాటలే వారికి పెట్టుబడి అత్యాశే రాబడి. మన మధ్య తిరుగుతూ కొందరు మోసపుచ్చుతున్నారు. ఒకచోట తక్కువ ధరకు వస్తువులు ఇప్పిస్తామని మరోచోట ఆరోగ్య పరీక్షలు చేస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తెలియని వ్యక్తుల్ని నమ్మవద్దని, ఏదైనా ఒకటికి పదిసార్లు పరిశీలన చేసుకుని డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా పల్నాడు జిల్లాలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే లీటర్ రూ.97గా ఉన్న డీజిల్ రూ.70కే ఇస్తామని ఓ వ్యక్తి చెబితే ముందు వెనుకా ఆలోచించకుండా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బోర్‌వెల్స్ వ్యాపారులు నమ్మి మోసపోయారు. 1000 లీటర్ల డీజిల్ రూ.70 చొప్పున ఇస్తానని మోసగాడు చెప్పడంతో పోటీపడి నష్టపోయారు. అవసరమే ఆసరాగా నమ్మించి మోసగించేవారు మన మధ్యనే ఉన్నారని ఈ విషయంతో వెల్లడైంది.
Rising Fraud Cases in Palnadu District :బీపీ, షుగర్, జీర్ణకోశ సంబంధ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వారివద్దకు నలుగురైదుగురు యంత్రాలతో వచ్చి రక్త పరీక్షలు చేసి మీ ఆరోగ్య సమస్యలేమిటో చెబుతామంటే నమ్మేస్తున్నారు. రూ.4,000ల నుంచి రూ.5,000లు అయ్యే వైద్య పరీక్షలు రూ.500కే చేస్తామని రక్తం తీసి, డబ్బు వసూలు చేసి పరారవుతున్నారు. సత్తెనపల్లి మండలం పెదమక్కెన వాసుల్ని ఇలాగే వైద్య పరీక్షల పేరుతో కొందరు మోసగించారు. పల్నాడు జిల్లాలోనూ ఈ తరహా మోసాలు జరిగాయి. ప్రజలు అప్రమత్తమై ఏ రూపంలో మోసపోతున్నామో తెలుసుకొనేలోపే మోసగాళ్లు నిలువునా దోచేస్తున్నారు.
వ్యాపార లావాదేవీలు విస్త్రృతంగా పెరిగాయి. దీన్ని అవకాశంగా తీసుకొని మాయగాళ్లు మన జేబును గుల్లజేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన ఓ మోసగాడు స్ఫూప్ యాప్ నిక్షిప్తం చేసుకుని మోసపూరిత నగదు చెల్లింపులు చేశాడు. ఒకటికి పదిసార్లు చెల్లింపులు చేసినా వ్యాపారులు తెలుసుకోలేకపోయారు. నగదు చెల్లించినట్లు ఆ యాప్‌లో టిక్ చూపిస్తుందే తప్పించి వారి బ్యాంకు ఖాతాకు నగదు జమ కాదు. సత్తెనపల్లిలో వ్యాపారులు అప్రమత్తమై మోసగాడిని పట్టించారు.