Bathukamma Celebrations in Telangana :రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. పెద్దసంఖ‌్యలో మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో అలరించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా సాగాయి. మహిళలు, చిన్నారుల సందేశాత్మక నాటికలు ఆకట్టుకున్నాయి.
రూట్స్ కొలీజియం కళాశాలలో విద్యార్థినిలు బతుకమ్మ, దాండియా ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. బాగ్‌లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యాసంస్థలు నిర్వహించిన సంబురాల్లో విద్యార్థినిలు సంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మను ఆడారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పైన ఉన్న బతుకమ్మ ఘాట్‌లో సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలందరూ ఒకే వస్త్రధారణతో బతుకమ్మ ఆడుతూ అలరించారు.
గాంధీ భవన్‌లో వైభవంగా వేడుకలు :హైదరాబాద్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పేట్లబుర్జులో సంబురాలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లో నిర్వహించిన వేడుకలకు మహిళా ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రమహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించిన వేడుకలు వైభవంగా సాగాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో బీఆర్‌ఎస్ మహిళా నేతలు ఆడి పాడారు. సచివాలయంలో ఉద్యోగులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
బతుకమ్మ ఆడితే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా - ఎలాగో తెలుసా? - Bathukamma Flowers History
జిల్లాల్లోనూ నానబియ్యం బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన వేడుకల్లో పెద్దసంఖ్యలో విద్యార్థినీలు పాల్గొన్నారు. మెదక్‌జిల్లా నర్సాపూర్‌లోని నరసాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో విద్యార్థినిల కోలాటం ఆకట్టుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని కాలేజీలో ముందస్తుగా రావణవధ నిర్వహించారు.