తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖలో లా స్టూడెంట్​పై గ్యాంగ్​ రేప్​ - స్నేహితులతో కలిసి ప్రియుడి ఘాతుకం - GANG RAPE IN ANDHRA PRADESH

న్యాయ విద్యార్థినిని నమ్మించి వంచించిన ప్రియుడు - రహస్యంగా వీడియోలు తీసి ఆపై స్నేహితులతో కలిసి అత్యాచారం

GANG RAPE IN ANDHRA PRADESH
Four Youth Arrested for Gang Rape in Visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 8:49 AM IST

Updated : Nov 20, 2024, 9:09 AM IST

Four Youth Arrested for Gang Rape in Visakhapatnam :ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి దగ్గరైన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాకుండా స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విశాఖలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో గడిపిన వీడియోలు చూపి బెదిరించి, అతడి స్నేహితులు యువతిపై ఒక్కొక్కరుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా తమ కోరికను తీర్చాలంటూ వేధించారు. ప్రియుడే ఫోన్​ చేసి అందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో యువతి తండ్రి ఆమెను కాపాడి, ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది.

దీంతో న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విశాఖ టూటౌన్​ సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని విశాఖకు చెందిన ఓ యువతి (20) న్యాయ విద్య అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సహ విద్యార్థి వంశీతో స్నేహం ఏర్పడి, ప్రేమగా మారింది. ఈ సంవత్సరం ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13న ఉదయం 11 గంటలకు ఆ యువతిని ద్విచక్రవాహనంపై డాబా గార్డెన్స్‌లోని తన స్నేహితుడు ఆనంద్‌ గదికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమెను బలవంతం చేసి మరోసారి శారీరకంగా కలిశాడు.

రహస్యంగా వీడియోలు తీసి : దీన్ని సీక్రెట్​గా వీడియా తీసిన వంశీ స్నేహితులు ఆనంద్, జగదీశ్‌, రాజేశ్​ గదిలోకి వచ్చి ఆ వీడియోను చూపించి ఆమెను బెదిరించారు. తరువాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురు న్యాయ విద్య అభ్యసిస్తున్నారు. మరొకరు ఓ ప్రైవేటు మోటార్స్‌ కంపెనీలో క్యాషియర్​గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ప్రియుడే దగ్గరుండి అత్యాచారం చేయించడంతో ఆమె నిలదీసింది. దీంతో వంశీ యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరవు పోతుందని భావించిన యువతి మౌనంగా ఉండిపోయింది.

కళాశాలకు సైతం వెళ్లకుండా యువతి ఇంటి వద్దే ఉండిపోయింది. అయినా మళ్లీ తమ కోరిక తీర్చమని రెండు నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్​ చేసి వేధిస్తున్నారు. వంశీ కూడా ఫోన్​ చేసి తన స్నేహితులు చెప్పినట్లు చేయాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కాపాడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురూ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

మేనమామ అనుకుంటే మానవ మృగమయ్యాడు - తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం

బట్టలు ఉతికేపని ఉందని పిలిచి మహిళపై సాముహిక అత్యాచారం

Last Updated : Nov 20, 2024, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details