Venkaiah Naidu Participated in Telugu Language Day Celebrations : తెలుగు భాషను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే విడుదల చేయాలని సూచించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో తొలి తెలుగు శాసనాలను పరిశీలించిన వెంకయ్య నాయుడు వాటిని సంరక్షించాలని కోరారు. క్రీస్తు శకం 575లో చోళరాజు ధనుంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం కలమల్లలో వెలుగు చూసిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తెలుగు భాష దినోత్సవాన్ని అక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్ ఘన స్వాగతం పలికారు.
తెలుగువారికి నాలుగో స్థానం : ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. న్యాయస్థానాల్లో కూడా వాదనలు, తీర్పులు సైతం తెలుగులోనే ఉండాలనీ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారు నాలుగో స్థానంలో ఉన్నారని.. ఇంగ్లీష్ మోజులో పడి తెలుగును మర్చి పోతున్నారన్నారని తెలిపారు. అమ్మ భాష కళ్లు లాంటిది.. పరాయి భాష కళ్లజోడు వంటిదని తెలిపారు. ప్రతి ఇంట్లోనూ తెలుగులోనే మాట్లాడే విధంగా ఉండాలన్నారు. అలాగే మాతృభాషను కాపాడటానికి మీడియా ప్రధాన భూమిక పోషించాలన్నారు. శాసనాలంటే రాళ్లు రప్పలు కాదు, అవి మన చరిత్రను తెలిపేవని గుర్తుచేశారు. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలన్నారు. కలమల్ల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని వెంకయ్యనాయుడు తెలిపారు.