SIB OSD Prabhakar Rao Gets Green Card In USA :తెలంగాణలో సంచలనమైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలోనే స్థిరపడిన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ స్పాన్సర్‌షిప్‌తో ప్రభాకర్‌రావుకు తాజాగా గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. తాజాగా పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన క్రమంలో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయిన సంగతి విధితమే. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అప్పటి నుంచి ఆ దేశంలోనే ఉన్నారు. మరోవైపు పోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు ఆఫీసర్స్‌ను అరెస్ట్ చేయడంతోపాటు ఆయన్ను కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అనంతరం న్యాయస్థానంలో ఛార్జిషీట్(అభియోగపత్రం) నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన్ని అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు పోలీసులు మెయిల్ ద్వారా నోటీసులు పంపారు.
వైద్య చికిత్స కోసమని అమెరికా వెళ్లి :వైద్యచికిత్స కోసమని అమెరికా వెళ్లిన తాను ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్ పోలీసులకు సమాచారమందించారు. జూన్‌లో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో డాక్టర్లు అనుమతిస్తే హైదరాబాద్ నగరానికి వస్తానని పేర్కొన్నారు. అయితే గడువు దాటినప్పటికీ రాకుండా అక్కడే ఉన్నారు. మార్చిలో 3నెలల కాలపరిమితితో కూడిన వీసాపై అక్కడకు వెళ్లిన ఆయన, గడువును మరో ఆరునెలలపాటు పొడిగించుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయనపై లుక్‌అవుట్ నోటీసు కూడా జారీ చేశారు.