Harish Rao Letter to CM Revanth : రాష్ట్రంలోని విద్యావ్యవస్థ, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయని, వాటన్నింటిని వెంటనే పరిష్కరించాలని మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందన్న మాటలకు ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్, రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు.
ఇందుకోసం బీఆర్ఎస్ హయాంలో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ, తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ పతనావస్థకు చేరుకొందని, పురుగులు లేని భోజనం, పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారని ఆక్షేపించారు. ఒకవైపు టీచర్లు లేని కారణంగా పాఠశాలలు మూతపడుతుంటే మరోవైపు విశ్వాసం సన్నగిల్లడంతో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అగమ్యగోచరంగా ప్రభుత్వ పాఠశాలలు : ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1864 ఉన్నాయని, 30లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9,447 ఉన్నాయని, వందలోపు విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు 9,609 అని మాజీమంత్రి హరీశ్‌రావు లేఖలో వివరించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలకు దాదాపు 20 వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆరోపించారు. ఇక గురుకులాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని, కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఖ్యాతి గడించిన గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారాయని మాజీమంత్రి మండిపడ్డారు.