Sand Mining Deadline Extended for JP Company : రాష్ట్రంలో మొన్నటి వరకు సాగిన ఇసుక దందాలో గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డే కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సాగిన వేల కోట్ల దోపిడీకి సహకరించారు. ఇసుక గుత్తేదారుగా జయ్ ప్రకాష్ పవర్ వెంచర్స్‌కు ఉన్న రెండేళ్ల గడువును, మరో ఆరు నెలలు పొడిగించి దీనికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయంటూ మొండిగా వాదిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపకుండా, వెంకటరెడ్డే గడువు పెంచేసినట్లు తాజాగా వెలుగు చూసింది.
వారేమైనా మా చుట్టాలా? :రాష్ట్రమంతటా ఇసుక తవ్వకాలు, విక్రయాలకు టెండరు దక్కించుకున్న జేపీ సంస్థ 2021 మే నుంచి 2023 మే వరకు వ్యాపారం చేసేలా ఒప్పందం చేసుకుంది. 2023 మే రెండోవారంతో గడువు ముగిసింది. అయితే తర్వాత కూడా జేపీ సంస్థ పేరిట ఇసుక తవ్వకాలు, విక్రయాలు కొనసాగాయి. దీనిపై గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డిని ప్రశ్నిస్తే ఆ సంస్థకు ప్రభుత్వం గడువు పెంచిందని అన్నారు.
మరో ఏడాది గానీ, మళ్లీ టెండర్లు నిర్వహించే వరకు గానీ ఆ సంస్థే కొనసాగేలా ఉత్తర్వులొచ్చాయని తెలిపారు. ఆదేశాల కాపీ ఇవ్వాలని ఎవరడిగినా దాటవేశారు. గత ఏడాది ఆగస్టు 31న అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డైరెక్టర్ వెంకటరెడ్డి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఇలాగే వాదించారు. గడువు పొడిగింపు ఆదేశాలున్నాయని వెంకటరెడ్డి చెప్పారు. జేపీ సంస్థకి పొడిగింపు ఇవ్వకుండా నడిపించడానికి వారేమైనా మా చుట్టాలా? అని పెద్దిరెడ్డి తిరిగి ప్రశ్నించారు.