Foreign Medical Graduates Problems in AP :ఎలాగైనా డాక్టర్లు కావాలన్న లక్ష్యంతో వారంతా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు. కొవిడ్ కష్టకాలంలోనూ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది ప్రాక్టీస్ పెట్టి ప్రజలకు సేవ చేయవచ్చు అనుకున్నారు.! కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి ఆశలకు గండికొట్టింది. నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. లైసెన్స్‌లు ఇవ్వండి మొర్రో అని మొరపెట్టుకుంటున్నా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో న్యాయం కోసం విద్యార్థులు రోడ్డెక్కారు.
ఎంబీబీఎస్ చదివేందుకు ఉచిత సీటు రాక ప్రైవేట్ కళాశాల కోటాల్లో ఫీజులూ చెల్లించలేక వందలాది మంది విద్యార్ధులు రష్యా, ఉక్రెయిన్, చైనా, కజకిస్తాన్, ఉబ్జెకిస్తాన్ తదితర దేశాలకు వెళ్లి చదివారు. వీరంతా తిరిగి భారత్‌కు వచ్చి ఇక్కడ వైద్య వృత్తి చేపట్టాలంటే జాతీయ వైద్య విద్య కమిషన్ నిర్వహించే పరీక్ష రాయాలి. ఉత్తీర్ణత పొందిన వారికే ఆయా రాష్ట్రాల్లో ఇంటర్న్‌షిప్‌కు అనుమతిస్తారు.
AP Medical Students PR Problem : విదేశాల్లో చదివిన ఏపీ విద్యార్ధులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకుని, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్‌లైన్‌లో ఏపీఎంసీకి దరఖాస్తులు చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరుకాగా ప్రాసెస్‌లో ఉందంటూ అధికారులు ఇన్నాళ్లూ మభ్యపెట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రక్రియనే నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎదుట మరోసారి ఆందోళనకు దిగారు.