తెలంగాణ

telangana

ETV Bharat / state

జానపద కళాకారుడు 'బలగం' మొగిలయ్య కన్నుమూత - సీఎం సహా పలువురి సంతాపం - FOLK ARTIST MOGILIAH PASSED AWAY

జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత - అనారోగ్యంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి - బలగం సినిమా ద్వారా గుర్తింపు పొందిన మొగిలయ్య

mogiliah
mogiliah passed away (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2024, 8:11 AM IST

Updated : Dec 19, 2024, 12:41 PM IST

Folk Artist Mogilaiah Passed Away : బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద గాయకుడు మొగిలయ్య ఇక లేరు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు మొగిలయ్య కన్నుమూశారు. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన మొగిలయ్య తన భార్య కొమురమ్మతో కలిసి జానపద పాటలు పాడుతూ జీవించేవారు.

ప్రముఖుల సాయం : ఈ క్రమంలోనే వారిని గుర్తించిన దర్శకుడు వేణు తన బలగం చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే కొమురయ్య పాట పాడించారు. ఆ పాటను చూసిన ప్రేక్షకులంతా కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా ప్రాణంపెట్టి ఆ పాట పాడిన మొగిలయ్య దంపతులను అభినందించారు. ఆ తర్వాత కిడ్నీ సమస్యలు వేధించడంతో మొగిలయ్య ఆస్పత్రి పాలయ్యారు. మొగిలయ్య అనారోగ్యం విషయం తెలిసిన బలగం చిత్ర దర్శక నిర్మాతలతోపాటు మెగాస్టార్ చిరంజీవి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం అందించారు. కొన్ని రోజులు హైదరాబాద్ నిమ్స్‌లో మొగిలయ్య చికిత్స పొందారు.

Balagam Actor Died : 'బలగం' నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు ఎమోషనల్​

తెలంగాణ ప్రభుత్వం కూడా మొగిలయ్యకు మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ అవార్డు వేడుకలో మొగిలయ్య దంపతులను సన్మానించి వారికి ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. మొగిలయ్య బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. మొగిలయ్య మరణం పట్ల బలగం చిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు సంతాపం ప్రకటించారు. మొగిలయ్య- కొమురమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. స్వస్థలం దుగ్గొండిలోనే మొగిలయ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సీఎం సంతాపం : మొగిలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం 'శారద కథల'కు ప్రాచుర్యం కల్పించి ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని అన్నారు. మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ ఆయన సతీమణి కొమురమ్మ ఇచ్చిన ప్రదర్శనలు వెలకట్టలేనివని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన "బలగం" సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. మొగిలయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Balagam movie Mogilaiah : 'బలగం' మూవీ మొగిలయ్యకు కారు బహుమతి

Balagam Movie Writer : ''బలగం' ప్రయాణంలో ప్రతి క్షణం నాకు పాఠమే'

Last Updated : Dec 19, 2024, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details