Flood Water Flow Into SRSP :నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 23,924 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1079 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 42 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉద్ధృతి :శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం తగ్గినా నందిపంపు హౌజ్, గాయత్రి బాహుబలి మోటార్ల ద్వారా మధ్యమానేరుకు నీటి తరలింపు వారం రోజులుగా కొనసాగుతోంది. దీంతో క్రమంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతోంది. కడెం ప్రాజెక్టు నుంచి కేవలం 3765 క్యూసెక్కుల నీరు పరివాహక ప్రాంతం నుంచి 2126క్యూసెక్కుల నీటితో కలిపి కేవలం 5891క్యూసెక్కులు మాత్రమే ఉంది.
Mid Manair Water Level Increasing :ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటి కోసం 310 క్యూసెక్కులు, నంది పంపుహౌజ్‌కు 12,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. దీంతో 20.175టీఎంసీల సామర్ధ్యం ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు 15.30టీఎంసీలకు తగ్గింది. మరోవైపు మధ్యమానేరుకు మూలవాగు నుంచి 4530 క్యూసెక్కులు తరలిస్తున్నారు. గాయత్రి నుంచి 12,600 క్యూసెక్కులు మొత్తం 17,130 క్యూసెక్కుల నీరు చేరుతున్నాయి. దీంతో మిడ్‌మానేరులో నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా వారం రోజుల్లో 13.76 టీఎంసీలకు చేరింది.