Flood to Krishna River Karakatta: కృష్ణానదికి వరదలు పోటెత్తిన సమయంలో జలవనరుల శాఖ అధికారులతో పాటు, రెవెన్యూ, జెడ్పీ అధికారులు అదనపు బాధ్యతలను చేపట్టాలి. 24గంటలూ అప్రమత్తంగా ఉండేలా కరకట్ట వెంబడి బృందాలు గస్తీ నిర్వహించాలి. కృష్ణా పరిరక్షణ విభాగం, జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కృష్ణా పరిరక్షణ విభాగం డీఈ, ఏఈలు, ఇతర సిబ్బంది నదికి వచ్చే వరదనీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రెండు జిల్లాల యంత్రాంగానికి సమాచారం ఇస్తారు. రెండువైపులా కరకట్ట వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా వరదకు సంబంధించిన సన్నద్ధత సమావేశం నిర్వహించకపోవడంతో ఈ వ్యవస్థ అంతా వెంటనే అప్రమత్తం కాలేకపోయింది. వరదల సమయంలో సిద్ధంగా ఉంచుకోవాల్సిన ఖాళీ సిమెంట్ సంచులు, వెదురు కర్రలు, ఇసుక, తాళ్లు, టార్చి లైట్లు, వరద లైట్లను యంత్రాంగం అందుబాటులో ఉంచలేదు. వరద సన్నద్ధతకు సంబంధించి సరైన ప్రణాళిక లేక అప్పటికప్పుడు సామగ్రి, సిబ్బందిని సమకూర్చుకుని పనులు చేస్తున్నారు. వరద తీవ్రత నేపథ్యంలో కరకట్ట వెంబడి అదనంగా వాచర్లను నియమిస్తారు. జలవనరులు, రెవెన్యూఅధికారుల బృందాలు సంయుక్తంగా పనిచేస్తాయి. వరద సమయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారు విధుల నుంచి వెళ్లే సమయంలో వారి స్థానంలో వచ్చిన అధికారికి అప్పటివరకు ఉన్న సమాచారాన్ని అందజేసి నిర్ధారించుకున్న తర్వాతే విధుల నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
అయితే సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ పక్కాగా చేపట్టలేకపోయారు. వరద తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి 2.5 కిలోమీటర్లకు గ్రామస్థాయి సిబ్బంది ఒకరు, ప్రతి 5 కిలోమీటర్లకు వాచరు ఒకరు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. రాత్రివేళ కూడా గస్తీ నిర్వహంచేలా ఏర్పాట్లు చూసుకోవాలి. 24 గంటలూ కరకట్ట పరిశీలనకు యంత్రాంగం పనిచేయాలి. అన్ని విభాగాల యంత్రాంగం కరకట్టపై ఉన్నప్పటికీ ముందస్తు సన్నద్ధత లేకపోవడంతో సమన్వయం కొరవడింది. 2009లో అత్యధికంగా 10.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ రికార్డులు బద్దలు కొడుతూ 11.45 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి సముద్రం వరకు వరదనీరు గ్రామాలవైపు రాకుండా రక్షణగా కరకట్ట ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 230 కిలోమీటర్ల మేర కరకట్ట ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో116.4 కిలోమీటర్ల మేర కరకట్ట ఉంటుంది. ఇందులో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 22, దిగువన 85.4 కిలోమీటర్లు, రాజుకాల్వ 9 కిలోమీటర్లు ఉంటుంది. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహణ చేపట్టకపోవడం, భారీ ఇసుక లారీలను అనుమతించడం వల్ల కరకట్ట చాలాచోట్ల కుంగిపోయింది. మరికొన్నిచోట్ల బలహీనంగా మారింది. తీరగ్రామాల ప్రజలు కరకట్టపైకి వచ్చి ఎప్పటికప్పుడు వరదను పరిశీలిస్తూ ఎక్కడైనా లీకేజీలు, గండ్లు పడే ప్రమాదం ఉందా? అని గమనిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.