POCSO Case Filed Against 4 Teachers in Navodaya School in Kamareddy District of Telangana : విద్యార్థులకు జీవిత పాఠాలు చెప్పి, మంచి- చెడుల పట్ల అవగాహన కల్పించాల్సి ఉపాధ్యాయులు వక్రబుద్ధితో వారితో అసభ్యంగా ప్రవర్తించారు. వారి చేష్టలు భరించలేని బాధిత విద్యార్థులు వారి బాగోతం బయటపెట్టారు. ఇప్పుడా కీచక టీచర్లు ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగింది.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులు కొంత కాలంగా తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఇటీవల కొందరు విద్యార్థినులు పూర్వ విద్యార్థుల వద్ద మొరపెట్టుకున్నారు.
వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో మొదట పోలీసు కేసు నమోదు చేయడంతోపాటు ఒక ఉపాధ్యాయుడిని కర్ణాటకకు బదిలీ చేశారు. తరువాత విచారణలో మిగతా ముగ్గురు ఉపాధ్యాయుల వేధింపులు కూడా వెలుగులోకి రావడంతో వారం క్రితం నలుగురు ఉపాధ్యాయులపైనా పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై శివకుమార్ ఆదివారం తెలిపారు.
"గుడ్ టచ్, బ్యాడ్ టచ్" - బయటపడిన ఉపాధ్యాయుల బాగోతం
ఇటీవల ఏపీలోని పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు తన విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు సదరు టీచర్ పై చర్యలకు దిగారు. చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు పదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉన్న విద్యార్థినిలు ఈ విషయాన్ని మహిళా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఉప విద్యాశాఖ అధికారి వేణుగోపాలరావును డీఈవో చంద్రకళ ఆదేశించింది. అప్పుడే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని తేలడంతో సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలాంటి ఘటనే కొద్దిరోజుల క్రితం కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్'పై వన్‌టౌన్ మహిళా పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆరో తరగతి విద్యార్థినులు కొంతమంది సదస్సుకు వచ్చిన మహిళా పోలీసు వద్దకు వచ్చి 'అక్కా లెక్కల మాస్టారు శ్రీనివాసరావు మాపై చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు' అని చెప్పారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులకు తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.