Minister Nara Lokesh Tour: విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించడంతో పాటు పలు సంస్కరణలు తీసుకువచ్చి పరిశ్రమలతో అనుసంధానించే దిశగా అడుగులు వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆధునీకరించిన ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేశ్, పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారి, షటిల్, టెన్నికాయిట్ కోర్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి లోకేశ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు గైడ్లు అందిస్తామన్నారు.
సొంత నిధులతో అనేక అభివృద్ధి పనులు: అనంతరం కాళ్ళ మండలం పెదఅమిరం చేరుకున్న మంత్రులు, ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు సహకారంతో ఏర్పాటు చేసిన స్వర్గీయ రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రతన్ టాటా మార్గ్‌గా నామకరణం చేసిన ఉండి - భీమవరం లింకు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రతన్ టాటా విగ్రహావిష్కరణలో కేంద్రమంత్రి భూపతిరాజు వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. రఘురామకృష్ణంరాజు సొంత నిధులతో అనేక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
రతన్ టాటా అనేది ఒక బ్రాండ్: ఉండి - భీమవరం లింక్ రోడ్డు అభివృద్ధి కార్యక్రమానికి రతన్ టాటా పేరు పెట్టడం అభినందనీయమన్నారు. దేశంలో రతన్ టాటా అనేది ఒక బ్రాండ్ అని, ప్రపంచానికి టాటా బ్రాండ్ పరిచయం చేసిందే రతన్ టాటా అని కొనియాడారు. రతన్ టాటా వ్యాపారం కన్నా విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు.
రఘురామను ఆదర్శంగా తీసుకోవాలి: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సొంత నిధులతో రఘురామకృష్ణంరాజు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ రఘురామను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం చినఅమిరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రతన్ టాటా విగ్రహావిష్కరణ సభలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి లోకేశ్, ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు రతన్ టాటా సేవలను గుర్తుచేసుకున్నారు.
నియోజకవర్గమంతా సురక్షిత మంచినీరు: రతన్ టాటా అంటేనే మానవత్వమని, సంపాదించిందంతా ట్రస్ట్ ద్వారా సమాజ సేవకే వినియోగించారని ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు రతన్ టాటా సేవలను గుర్తుచేసుకున్నారు. రతన్ టాటా విగ్రహం ప్రారంభానికి తగిన వ్యక్తి నారా లోకేశ్ కావడంతో ఆయన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కర చేయించినట్లు చెప్పుకొచ్చారు. ఉండిలో దాతలు, స్నేహితులు, పారిశ్రామికవేత్తల సహాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న రఘురామ, రాబోయే 6 నెలల్లో నియోజకవర్గమంతా సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
జగన్ హయాంలో భారీ విధ్వంసం - పారిశ్రామికవేత్తలు హామీ కోరుతున్నారు: లోకేశ్