Flood Flow Increasing in Vijayawada Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి స్పల్పంగా తగ్గింది. బ్యారేజీ మొత్తం 70 గేట్లు ఎత్తి 11.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 24.7 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గేట్ల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. పెరుగుతున్న కృష్ణా నది ఉద్ధృతితో పరీవాహక ప్రాంతం ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చే మార్గాల్లో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బ్యారేజ్ వద్ద బోటు ఢీకొనడంతో 69వ పిల్లర్ దెబ్బతినగా 67, 68, 69 పిల్లర్ల మధ్య ఐదు ఇసుక బోట్లు కొట్టుకొచ్చాయి.
నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువచ్చారు. ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను ఆయన పరిశీలించారు. కన్నయనాయుడు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.