Warangal Congress Flexi War : మంత్రి కొండా సురేఖ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య్ ఫ్లెక్సీల వివాదం వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా వరంగల్ జిల్లా ధర్మారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేకపోవడం రేవూరి వర్గీయులు వాటిని చించేయడం వివాదానికి దారితీసింది. దీంతో రెండు వర్గాల మధ్య పరస్పరం దాడి జరగ్గా, ఇద్దరు గాయాలపాలైయ్యారు.
ఘటనపై మంత్రి కొండా సురేఖ పోలీస్ స్టేషన్లో ఆరా : బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, మంత్రి కొండా సురేఖ వర్గానికి చెందిన 8 మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొండా అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రేవూరి అక్రమంగా తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ వరంగల్ నర్శంపేట ప్రధాన రహదారి ధర్మారం వద్ద కొండా వర్గీయులు ధర్నా చేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ గీసుకొండ పోలీస్ స్టేషన్కు విచ్చేసి కేసు విషయమై పోలీసులను నిలదీశారు.