Seven People Died due to Lighting Strike in Telangana :మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా మారిన వాతావరణం నిర్మల్ జిల్లాలో ఇద్దరి పట్ల మృత్యుపాశంగా మారింది. జిల్లాలోని దిలవార్పూర్ మండలంలోని కాల్వ గ్రామనికి చెందిన ప్రవీణ్(26) అనే రైతు గురువారం మధ్యాహ్నం వ్యవసాయానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఈ క్రమంలో ప్రవీణ్ ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకుని విత్తనాలు చల్లుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై పంటపొలంలోనే కుప్పకూలిపోయాడు.
వెంటనే అక్కడున్న స్థానిక రైతులు ఇది గమనించి అతన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్యాంట్ జేబులో సెల్ఫోన్ ఉండటం వల్లే పిడుగుపాటుకు గురయ్యాడని స్థానికులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఆ జిల్లాలోని పిడుగుపాటుకు ఓ బాలుడు దుర్మరణం చెందాడు. తానుర్ మండలం ఎల్వత్ గ్రామంలో 13 సంవత్సరాల ఓ బాలుడు మేకలను తీసుకొస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. దీంతో నిర్మల్ జిల్లాలోని విషాద ఛాయలు అలుముకున్నాయి.
మామిడి చెట్టు కింద విగతజీవిగా మారిన బాలుడు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. సీతానగరంలో పిడుగుపాటుకు బాలుడు మృత్యువాత పడ్డాడు. మేకల విజయ్ సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు సంతోశ్ భద్రాచలం వికలాంగుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటి వద్ద ఉంటున్న సంతోశ్ సాయంత్రం వేళ గ్రామ శివారులోని మామిడి చెట్టు వద్దకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు.
ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షంతో పాటు చెట్టుపై పిడుగు పడింది. చెట్టు కింద ఉన్న సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు పిల్లలు స్పృహ తప్పి పడిపోయారు. గత సంవత్సరంలో అనారోగ్యంతో తండ్రి, ఇప్పుడు పిడుగుపాటుతో కుమారుడు మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.