రీఫండ్‌లపై శాఖలో టెన్షన్ రీఫండ్‌ల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు హైకోర్టు కీలక ఆదేశాలు (ETV Bharat) Five GST Officials Arrested In Refund Fraud Issue :తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు భయంభయంగా పని చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ అధికారులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా పరిస్థితి మారింది. విద్యుత్తు వాహనాల క్రయవిక్రయాల మాటున సిమెంట్ బదులు టాల్కమ్ పౌడర్ అమ్మకాలు చేసినట్లు చూపి, దాదాపు రూ.60 కోట్లు రీఫండ్‌లు అక్రమార్కులు నొక్కేసిన కుంభకోణం మార్చిలో వెలుగులోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదు మేరకు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అయిదుగురిని అరెస్టు చేశారు. దీంతో వ్యాపార లావాదేవీలు చేయకుండానే దరఖాస్తు చేసుకున్న అక్రమార్కులకు రీఫండ్‌లు ఇచ్చిన, ప్రాసెస్ చేసిన మరికొందరు అధికారుల్లో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది. ఎక్కడ తమ మెడకు కూడా చుట్టుకుంటుందో తెలియక మరికొందరు అధికారులు అయోమయంలో ఉన్నారు.
GST Frauds In Telangana :ఇక బయట దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టంలో ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించింది. సాఫ్ట్‌వేర్ ఎగుమతులతో పాటు పలురకాల ఎగుమతులను జీఎస్టీ నుంచి మినహాయించింది. అయితే స్థానికంగా కొనుగోలు చేసిన సాప్ట్‌వేర్, ఇతర ముడిసరుకులపై చెల్లించిన జీఎస్టీ రీఫండ్ కింద ఆయా కంపెనీలు తీసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలో పేరు మోసిన ఓ సాప్ట్‌వేర్ కంపెనీ తాము చేసిన ఎగుమతులకు సంబంధించి రీఫండ్ కోసం 2019లో వెయ్యి కోట్లుకుపైగా మొత్తానికి సంబంధించి 46 దరఖాస్తులు చేసింది.
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు - జీఎస్టీ ‘రీ ఫండ్’ కేసులో తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అవినీతి - GST Refund Fraud in Telangana
అప్పటి హైదరాబాద్‌రూరల్ డివిజన్‌లో పని చేసిన అధికారి వాటిని పరిశీలించి ప్రాసెస్ చేయాల్సి ఉంది. జీఎస్టీ చట్టం మేరకు 2నెలల్లో ఆ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎన్నిసార్లు అధికారిని కలిసినా స్పందించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఆ అధికారి ఏలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలా రెండేళ్ల పాటు పక్కన పెట్టినట్లు సమాచారం. కంపెనీకి చెందిన ప్రతినిధులు ఈ విషయాన్ని అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేసే పనిని మరో అధికారికి బదిలీ చేశారు. దీంతో ఆ అధికారి ఒక్కో దరఖాస్తును పరిశీలన చేస్తూ వచ్చారు.
మొదట్లోనే అప్రమత్తమై :మొదట 4 దరఖాస్తులను రీఫండ్‌కు అర్హం కానివని తిరస్కరించారు. ఆ వెంటనే సంబంధిత కంపెనీ వాణిజ్య పన్నుల శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసింది. ఆ 4 దరఖాస్తులను పరిశీలించిన అప్పిలేట్ అధికారి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని రీఫండ్ ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. దీంతో మిగిలిన 42 ధరఖాస్తులను కూడా పరిశీలన చేసిన అధికారి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో పేర్కొన్నట్లు డాక్యుమెంట్లు కలిగిన మరో 7 దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు.
జీఎస్టీ రీఫండ్ కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు - బోగస్ బిల్లులతో రూ.40 కోట్లు కాజేశారు - GST Refund Scam Update
దరఖాస్తు ఆలస్యం కారణంగా వడ్డీ :దాదాపు వెయ్యి కోట్లు రీఫండ్‌లకు సంబంధించిన 46 ధరఖాస్తుల్లో 11 దరఖాస్తులకు మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రీఫండ్ ఇచ్చింది. అయితే రీఫండ్ చెల్లించడంలో తీవ్ర జాప్యం చేసినందున జీఎస్టీ చట్టం ప్రకారం ఆలస్యానికి 6శాతం వడ్డీ చెల్లించాలంటూ ఆ సాప్ట్‌వేర్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి స్థాయిలో విచారించిన హైకోర్టు తాజాగా రూ.37.62 కోట్లు వడ్డీ చెల్లించాలని తీర్పు వెలువరించింది. దీంతో అప్రమత్తమైన వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత కమిషనర్ టీకే శ్రీదేవి దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేయకుండా రెండేళ్ల పాటు పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసిన ఉన్నతాధికారిని సస్పెండ్ చేశారు. ఆ వెంటనే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆ రీఫండ్ ఇచ్చిన దరఖాస్తులను సైతం పునఃపరిశీలన చేసేందుకు మరో ఉన్నతాధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏ మేరకు సరైందో పరిశీలన చేయాలని ప్రస్తుత కమిషనర్ శ్రీదేవి ఆదేశించినట్లు తెలుస్తోంది. పన్నుల ఎగవేతదారులపై కఠినంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో వాణిజ్య పన్నుశాఖ అధికారులు మరింత జాగ్రత్తగా పని చేస్తూ చట్టం పరిధిలో నియమావళి, మార్గదర్శకాలు పాటిస్తూ రీఫండ్‌లు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పదింది.
జీఎస్టీ రీఫండ్‌ల ముసుగులో ప్రభుత్వ ఖజానాకు గండి - మరో ఐదుగురు అధికారుల అరెస్టు - GST Fraud in Telangana