Hyderabad Metro Rail Second Phase:మెట్రో రైలు రెండోదశలో 5 కారిడార్లు రానున్నాయి. దీనికి సంబంధించి 2028 నాటికి ప్రయాణికుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించగా ఇందులో 54 స్టేషన్లు రానున్నాయి. అప్పటికి ఇవన్నీ పూర్తయితే ప్రతిరోజూ 7.96 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో సంస్థ అంచనా వేస్తోంది.
కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు మెట్రో సంస్థ తెలిపింది. ఇప్పుడైతే ప్రయాణికుల అంచనాల సంఖ్యను తక్కువ చేసి చూపించామని వాస్తవంగా ప్రయాణికుల సంఖ్య 10 లక్షల దాకా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో మెట్రో ప్రారంభమై బుధవారంతో ఏడేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు మెట్రోలో 63.40 కోట్ల మంది ప్రయాణించారు.
ఆ రెండు మార్గాల్లోనే ప్రయాణికులు అత్యధికం :ప్రస్తుతం నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదనలు 2వ దశలోనే ఉన్నాయి. ఇదే మార్గానికి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట దగ్గర పాత కారిడార్లను కలపనున్నారు. దీంతో ఎయిర్పోర్టు కారిడార్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 3.70 లక్షల వరకు ఉంటారని ఓ అంచనా. ఇక్కడే అత్యధికంగా ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తుంటారు. అలాగే మియాపూర్ నుంచి పటాన్చెరు మార్గంలో 1.65 లక్షల మంది ప్రయాణిస్తారనే అంచనాకు అధికారులు వచ్చారు. మిగతా కారిడార్లలో లక్షలోపే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 2028కి ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాతో మెట్రో ఈ లెక్కలు వేసుకుంది.