Fitness Certificate Issue Process to Private Companies: ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రైవేటీకరణ పేరుతో ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను భారీ కుంభకోణంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. దీనికోసం టెండర్లు పిలవడంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా టెండర్లు దక్కించుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులపైన తాజాగా ఫిట్నెస్ ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయటానికి చెల్లించాల్సిన ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ పెంపుదలతో వాహనదారులపై వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని కోటి 46 లక్షల వాహనదారులందరిపై ప్రతి సంవత్సరం ఈ భారం పడుతుంది.
బాబోయ్ మావల్ల కాదంటున్న లారీ యజమానులు - పన్ను భారంతో వృత్తినే వదిలేస్తున్న దయనీయ పరిస్థితి
ఇప్పటికే మోటార్ వాహనాల పన్ను, గ్రీన్ టాక్స్, టోల్ టాక్స్, భారీ పెనాల్టీలతో రవాణా రంగాన్ని, వాహనదారులపై భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్నెస్ పేరుతో తొమ్మిది వందల రూపాయలున్న ఫీజులను సుమారు 12 వేలకు పెంచుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల ప్రక్రియ మొత్తాన్ని కట్టబెట్టడం సరైందని కాదని అభిప్రాయపడుతున్నారు