FISH TRAP WITH PLASTIC WATER BOTTLE : చేపలు పట్టేందుకు ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని అనుసరిస్తారు. మత్స్యకారులు ఎక్కువగా వలలు ఉపయోగిస్తుంటారు. ఇక యువత అయితే సరదాగా ఎరలు ఉపయోగించి, తాము కూడా ఏ మాత్రం తక్కువ కాదంటూ నిరూపించుకుంటారు. ఇలా కొన్ని సార్లు సరదాగా వెళ్లి కిలోల కొద్దీ చేపలు పట్టుకొని వస్తుంటారు. తాజాగా యానాంలో కొంతమంది యువకులు చేపలు పట్టేందుకు కొత్త టెక్నిక్‌ని కనిపెట్టారు. ఇందుకోసం కేవలం ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు. కిలోల కొద్దీ చేపలు పట్టుకుని తీసుకుని వెళ్లొచ్చు. ఇంతకీ వారు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కొంతమంది యువకులు సులువుగా చేపలు పట్టేస్తున్నారు. ఇందుకు కేవలం వారు ఒక ప్లాస్టిక్ బాటిల్, మైదాపిండి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ సీసాను పైభాగం తొలగించి, మిగిలిన భాగంలో మైదా పిండిని ముద్దగా చేసి పెడుతున్నారు. ఇప్పుడు దానికి తాడును కట్టి నదిలోకి జార విడుస్తున్నారు.
బాటిల్లోని మైదా పిండి తినేందుకు అందులోకి వచ్చిన చేపలు తిరిగి వెనక్కి వెళ్లలేకపోతున్నాయి. కొద్ది సేపటికి ప్లాస్టిగ్ బాటిల్‌ని ఒడ్డుకు లాగి అందులోని చేపను తమ బుట్టలో వేసుకుంటున్నారు. ఇలా 2 కేజీల వరకూ చేపలు దొరుకుతున్నాయని మత్స్యకారులు, యువత తెలిపారు. స్థానిక జీఎంసీ బాలయోగి వారధి పక్కన గోదావరి ఒడ్డున గుంపులు గుంపులుగా యువత కూర్చుని ఇదే పనిలోనే ఉంటున్నారు.