తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలివే - Fire Accidents in Summer - FIRE ACCIDENTS IN SUMMER

Fire Accidents In Summer : నాగరికత నేర్చుకునే క్రమంలో మనిషి కనుగొన్న వాటిల్లో ఒకటి నిప్పు. మనుషుల జీవిత ప్రయాణంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్న ఈ నిప్పు ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలను సైతం తీస్తుంది. అయితే ఈ ఏమరపాటు ఎక్కువైందో లేక అధికారుల నిర్లక్ష్యమో గాని తెలంగాణలో అగ్గి ప్రతి ఏటా వందల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ముఖ్యంగా పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ప్రతి రెండు రోజులకు ఒకసారి కర్మాగారాల్లో ప్రమాదాలు జరగడం తెలంగాణలో పరిస్థితిని కళ్లకు కడుతోంది. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఈ ఘటనలపై మరోసారి చర్చకు తెర తీసింది. పరిశ్రమలు మాత్రమే కాదు గృహ, వ్యాపార సముదాయాల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మేలుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. మరి పరిస్థితి ఎందుకు ఈ స్థాయికి వచ్చింది. దీనికి ఎవరి నిర్లక్ష్యం కారణం. ఎండాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Fire Accidents in Summer
Fire Accidents in Summer

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 6:57 PM IST

భానుడి భగభగలు- రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Fire Accidents in Summer :ఆహారాన్ని వండుకోవడం నుంచి దేశ ఆర్థిక ప్రగతికి మూలమైన పారిశ్రామిక రంగాన్ని నడిపిస్తున్నది అగ్ని. దేశంలో వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు ముడిపడి ఉన్నది అగ్నితోనే. అదే సమయంలో ప్రమాదాల రూపంలో అగ్ని చేస్తున్న నష్టం తక్కువేమీ ఉండడం లేదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి, వేలాది మంది మరణాలకు కారణం అవుతున్నాయి. అయితే తెలంగాణలో ఈ ప్రమాదాల తీవ్రత ఇంకా ఎక్కువ ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అత్యంత కలవరపెట్టేలా మారాయి.

పరిశ్రమలు, కర్మాగారాల శాఖ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2021-23 మధ్య కాలంలో 6వందల అగ్ని ప్రమాదాలు (Fire Accidents)జరిగాయి. అంటే ప్రతి రెండు రోజులకు ఒక ప్రమాదం జరుగుతున్నట్లు లెక్క. వీటిలో ఎక్కువగా హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, పాశమైలారం, పటాన్‌చెరు, సంగారెడ్డి, కాటేదాన్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈనెల 3వ తేదీన కూడా సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో ఆయిల్‌ బాయిలర్‌ పేలి ఆరుగురు మృతి చెందారు. ఇలా వరుస ఘటనలతో అగ్ని ప్రమాదాలకు తెలంగాణ కేంద్రంగా మారింది.

షార్ట్​ సర్క్యూట్​, రసాయన చర్యల వల్లే అధిక ప్రమాదాలు

2021-23 మధ్య కాలంలో రాష్ట్రంలోని పరిశ్రమలు(Industries), కర్మాగారాలు, గిడ్డంగులు, గృహ సముదాయాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఒక వెయ్యి 113 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి రోజు ఒక మరణం సంభవిస్తున్నట్లు లెక్క. 2022లో 418 మంది చనిపోగా, 2023లో 402 మంది చనిపోయారు. ఇది గత దశాబ్ద కాలంలోనే అధిక అంకెలు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలు(Manmade Mistakes), భద్రతా చర్యలు పాటించడంలో కంపెనీలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, ఖర్చును తగ్గించుకునేందుకు నైపుణ్యం కల్గిన సిబ్బంది స్థానంలో రోజువారీ కార్మికులను నియమించడం వంటి కారణాలతో జరుగుతున్నాయి.

రసాయన చర్యలు, షార్ట్‌ సర్క్యూట్‌ వంటి కారణాలు కూడా అధిక ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తెలంగాణలో ఫార్మా, రసాయన సహా 4వేల 130 అత్యంత ప్రమాదకర పరిశ్రమలు ఉన్నట్లు కర్మాగారాల శాఖ తెలిపింది. అయితే ఇన్ని పరిశ్రమలు ఉంటే వాటిల్లో తనిఖీలు చేసే ఇన్స్‌పెక్టర్లు, జాయింట్‌ ఇన్స్‌పెక్టర్లు మాత్రం కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. మరో 8 ఇన్స్‌పెక్టర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు పెరగడానికి ఇది కూడా ఓ కారణం.

Fire Department Inspections In Industries :పరిశ్రమల్లో ఒక్క వ్యక్తి తప్పు చేసినా అది భారీ ప్రమాదానికి దారి తీస్తుంది. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించిన ఫార్మా, రసాయన పరిశ్రమల్లో తమ సిబ్బంది ఏడాదికి ఒక సారి అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లు, యంత్రాలు, పరికరాలతో పాటు వాటి పనితీరును పరిశీలిస్తున్నట్లు కర్మాగారాల శాఖ అధికారులు తెలిపారు. కర్మాగారాల్లో ఆయా ఏర్పాట్లకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణ ప్రోటోకాల్‌తో తాము సంతృప్తి చెందకుంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.

పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు అధికారుల సూచనలు

  • యంత్రాల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి
  • అక్కడకు సులభంగా చేరుకునే ఏర్పాట్లు చేయాలి
  • గుంతలు, సంపులను మూసి ఉంచాలి
  • క్రేన్లు, ఒత్తిడితో కూడిన వెసెల్స్‌ను పరిశీలించడం
  • పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం
  • ఎక్కువ మంది ఒకే చోట పని చేయకుండా ఉండడం

Fire Accidents in Industrial Areas : పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రమాదకర రసాయన కర్మాగారాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై పర్యవేక్షణ విషయంలో కర్మాగారాల శాఖ సిబ్బంది కొరతతో పాటు ఉన్న వారు సైతం తూతూ మంత్రంగా పని చేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రమాదాలకు అవకాశం ఉన్న పరిశ్రమల్లో ఏడాదికి ఒక సారి కాకుండా వాస్తవంగా ప్రతిరోజు పర్యవేక్షణ ఉండాలి. అయితే అధికారులు అనుమానం వస్తేనే తాఖీదులు ఇస్తున్నారు. ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక క్రైసిస్‌ బృంద సమావేశాలు ఏర్పాటు చేయాలి. అయితే చాలా కాలంగా దాని ఊసే లేదనే విమర్శలు ఉన్నాయి.

Causes of Fire Accidents In Industries :రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా రియాక్టర్ల వద్దే జరుగుతున్నాయి. కొత్త ఉత్పత్తులు చేయడం, రసాయనాలను ఓ పద్ధతిలో కలపకపోవడం, వేగంగా రియాక్టర్లో వేయడం, రసాయనాలను బస్తాల్లో దులపడంతో అకస్మాత్తుగా భారీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రియాక్టర్ల భద్రతపై ప్రతి కర్మాగారంలో ప్రత్యేక విభాగం ఉండాలి. ప్రతి పరిశ్రమలో భద్రతా విభాగం ఉంటున్నా ఫలితం ఉండడం లేదు. ఆధునిక పరికరాల కొనుగోలుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. గోదాముల్లో రసాయనాల రాపిడి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్మాగారాల భద్రత శాఖ ఏటా జీరో లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. పరిశ్రమల అగ్ని ప్రమాదాల్లో వలస కార్మికులే ఎక్కువ శాతం సమిధలుగా మారుతున్నారు. వారికి సరైన పరిహారం కూడా అందడం లేదు.

బహుల అంతస్థుల వాణిజ్య సముదాయాల్లో ప్రమాదాలు
పరిశ్రమలు, కర్మాగారాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఓ వైపు కలవరపెడుతుండగానే రాష్ట్రంలో బహుళ అంతస్థుల నివాస, వాణిజ్య సముదాయాల్లో జరుగుతున్న ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ సహా నగరాలు, పట్టణాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌, స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌, బోయిగూడ ప్రమాదాలు నగర చరిత్రలో చీకటి అధ్యాయాన్ని మిగిల్చాయి.

Fire Accidents In Buildings : భవనాల్లో అగ్నిమాపక ఏర్పాట్లు సరిగా లేకపోవడం, షార్ట్‌ సర్క్యూట్‌లు, రసాయనాలు, ఫైబర్ వంటి వస్తువులను నిల్వ చేయడం, పై అంతస్థుల్లో భారీ పరిమాణంలో వంటలు, సిలిండర్‌ పేలుళ్లు వంటివి ప్రమాదాలకు ఎక్కువగా కారణం అవుతున్నాయి. భవన యజమానుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వీటిని పరిశీలించి భవన యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అగ్ని మాపక విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భవనాల యజమానుల నుంచి లంచాలు స్వీకరించి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా అమాయక ప్రజలు ప్రమాదాల్లో అగ్నికీలలకు బలయ్యే దుస్థితి నెలకొంది.

అప్రమత్తతే అన్నిటికంటే ముఖ్యం
రాష్ట్రంలో అంతకంతకూ పెరిగిపోతున్న అగ్ని ప్రమాదాలు తక్షణం మేల్కోవాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి. అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను అత్యంత పటిష్ఠం చేయడంతో పాటు వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడ అప్రమత్తంగా ఉండాలి. అగ్నిమాపక సిబ్బంది సైతం విదేశాల్లో వినియోగిస్తున్న అగ్నిమాపక పద్ధతులు, పరికరాలను అందిపుచ్చుకోవాలి. ఈ చర్యలన్నీ తీసుకుంటేనే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్టపడుతుంది. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, అంతకంటే విలువైన మనుషుల ప్రాణాలను రక్షించుకోవడానికి వీలవుతుంది.

వేసవిలో భయపెడుతోన్న అగ్ని ప్రమాదాలు - ఈ విపత్తులను అధిగమించేదెలా? - Fire Accidents In Summer

వేసవిలో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : డీఎఫ్​వో - FIRE OFFICER SRINIVAS INTERVIEW

హైదరాబాద్‌ జంట నగరాల్లో అగ్ని ప్రమాదాలను నివారించేదెలా?

ABOUT THE AUTHOR

...view details