Fire Accident at Tukkuguda in Rangareddy :హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్ ఉమెన్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో బియ్యం సంచుల మీద ముద్రణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పరిశ్రమలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. గమనించిన సిబ్బంది పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు.
అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 8 శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంటల ధాటికి పరిశ్రమ ఒకవైపు కుప్పకూలింది. మిగతా భవనం కూడా బీటలు వారి, అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
7 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది :దాదాపు 7 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అందులోని సామగ్రి, యంత్రాలు బుగ్గి పాలయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నప్పటికీ ఘటనపై విచారణ పూర్తయితే కారణాలు తేలే అవకాశం ఉంది. అయితే పరిశ్రమకు ఆవరణలోనే ఇందులో పని చేసే సిబ్బంది ఉంటున్నప్పటికీ వారంతా ముందుగానే బయటకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.