Police Taken Film Director Ram Gopal Varma Case Seriously : సంచలన సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసు దర్యాప్తు బృందాలకు చిక్కని వర్మ ఏకంగా బుల్లితెరపై ప్రత్యక్షమై ఇంటర్వ్యూలు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్సీపీ హయాంలో 'వ్యూహం' సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, నారా లోకేశ్‌లపై సామాజిక మాధ్యమ వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టారు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో ఈ నెల 11న వర్మపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన పోలీసులతో దోబూచులాడుతున్నారు. విచారణకు సహకరిస్తానంటూనే పోలీసులతో జిత్తులు ప్రదర్శిస్తున్నారు. దీంతో వర్మ కేసు విచారణను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
సినిమా షూటింగ్‌లో బిజీగా : అసభ్యకర పోస్టుల విషయంలో విచారణకు హాజరవ్వాలని ఏకంగా వర్మ ఉంటున్న హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి వెళ్లి మరీ ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అప్పుడు చిరునవ్వులు చిందిస్తూ వర్మ వాటిని అందుకున్నారు. అనంతరం ఈనెల 19న తేదీన ఒంగోలు రూరల్ సీఐ, దర్యాప్తు అధికారి ఎన్.శ్రీకాంత్‌బాబు ఎదుట హాజరు కావాల్సి ఉన్నా వర్మ డుమ్మకొట్టారు. ముందుగా నిర్ణయించుకున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, ఇప్పుడు వస్తే తన నిర్మాతకు నష్టం కలుతుందని, అందుకే వారం రోజులు గడువు ఇవ్వాలని విచారణ రోజున వాట్సప్ ద్వారా దర్యాప్తు అధికారిని కోరారు.
ఆర్జీవీ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - వాదనలు వినిపించనున్న ఏజీ
వర్మ నివాసానికి వెళ్లిన పోలీసులు : తరువాత అదే రోజు 11 గంటల సమయంలో తన తరఫు న్యాయవాది శ్రీనివాసరావు ద్వారా ఓ లేఖ ఇప్పించారు. అప్పటికి పోలీసులు రామ్‌గోపాల్ వర్మ అభ్యర్థనను మన్నించారు. అనంతరం 25న తేదీన హాజరుకావాలని మరోసారి నోటీసులు పంపారు. దీంతో విచారణకు సహకరిస్తానని, న్యాయవాది ద్వారా నోటీసులు పంపిన వర్మ ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అనంతరం సెల్‌ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. రెండు సార్లు పిలిచిన విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు నేరుగా హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.