Python in Nizamabad District : మనం గ్రామాలలో చెట్లు దట్టంగా ఉన్న ప్రదేశాలల్లో పాములు ఉండడం సహజం. అడవి, దట్టమైన చెట్లు ఉన్న చోటే వాటి నివాసం. కానీ అవి మనం ఉన్న చోటే ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకుంటానే శరీరంలో గుబులు పుడుతోంది కదా. మనం తిరిగే ప్రదేశాల్లో కాకుండా ఏకంగా ఇంట్లో, వాష్‌రూంలో, వాషింగ్ మెషిన్లో, బైక్‌లోనూ ఉంటే ఎవరికైనా వామ్మో అని భయంగా ఉంటుంది. అవును మీరు భయపడినా ఇంట్లోనూ, బాత్రూంలో ఆఖరికి బైక్‌లో కొండచిలువ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగిన చోట అక్కడున్న వ్యక్తులు భయాందోళనకు గురికావడం పక్కా. ఇలాంటి ఘటనే కొందరు స్థానికులను నిజామాబాద్ జిల్లాలో భయపెట్టింది.
ఏకంగా పదిహేను అడుగులు : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం శివారులో స్థానికులకు ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాని పొడవు సుమారుగా పదిహేను అడుగులు ఉంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు నిజామాబాద్ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్(పాములు పట్టే వ్యక్తి) మల్లేశ్‌కు సమాచారమిచ్చారు. ఆయన వెంటనే కొండ చిలువ ఉన్న ప్రాంతానికి చేరుకుని సుమారు గంటపాటు శ్రమించి దాన్ని పట్టుకున్నారు. పదిహేను అడుగుల పొడవు ఉన్న ఈ పామును సురక్షితంగా దగ్గరలోని దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు.