Few People Taking Salary without work in GHMC :ఎక్కడైనా సరే పని చేస్తేనే జీతం వస్తుంది. కానీ జీహెచ్‌ఎంసీలో కొందరు పని చేయకుండానే జీతాలు పొందుతున్నారు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అవును ఈ తంతు కొన్నేళ్ల నుంచి నడుస్తోంది. ఇంట్లోనే ఉండి, వేరే పనులు చూసుకుంటూ బల్దియాలో జీతం తీసుకుంటున్న ఉద్యోగుల్లో రవాణా విభాగం ప్రధానమైనది. ఇంత జరగుతున్నా, దీనికి సంబంధిత రవాణా విభాగం ఇంజినీర్లు, ఎంటమాలజీ విభాగంలోని సీనియర్ ఎంటమాలజిస్టులు, పారిశుద్ధ్య విభాగంలోని వైద్యాధికారులు, ఇంజినీర్లు స్పందించడం లేదు.
జీహెచ్‌ఎంసీలో పని చేయకుండానే మొత్తం 1500 మంది జీతాలు పొందుతున్నారు. వీరిలో రవాణా విభాగానికి చెందిన వారే 800 మంది ఉన్నారు. పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగాల్లోనూ మరో 700 మంది పని చేయకుండా అక్రమంగా జీతాలు తీసుకుంటున్నారు. మరోవైపు అక్రమంగా జీతాలే కాకుండా కొందరు డీజిల్ కూపన్ల దందా కూడా చేస్తున్నారు. కవాడిగూడ పార్కింగ్ యార్డులో 150 వరకు లైట్ మోటారు, హెవీ వెహికల్స్ ఉన్నాయి. వీటి మర్మమతుల పేరుతో రూ.5 కోట్లను కొందరు ఉద్యోగులు దారి మళ్లిస్తున్నారు. వాహనాల టైర్లు, డీజిల్ కూపన్లను విక్రయిస్తున్నారు.
పని చేసే వారిపైనే భారం : జీహెచ్‌ఎంసీ రవాణా విభాగంలో పొరుగు సేవల కింద పని చేసే డ్రైవర్లు, ఇతర లేబర్లు మొత్తం 2 వేల మంది ఉంటారు. అందులో చాలా మంది రికార్డులోనే ఉంటున్నారు. పలువురు పాలక మండలి నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ఇంట్లో పని చేసే వారిని ఉద్యోగిగా చేర్పిస్తున్నారు. నేతలు పదవి దిగిపోయాక కూడా కొందరు అలాగే వారిని ఉగ్యోగిగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పని చేయకుండా జీతాలు వస్తుండటంతో బల్దియాను ఓ ఏటీఏం కార్డులా వాడుకుంటున్నారు. నకిలీ సిబ్బంది గైర్హాజరుతో రోజూ విధులు నిర్వర్తించే ఉద్యోగులపై కూడా భారం పడుతోంది.
ఆ విజిలెన్స్ అధికారులకు జీతాలివ్వొద్దు : మరోవైపు ఈ నెల 12న కూడా బల్దియా కమిషనర్ ఆమ్రపాలి కొందరు ఉద్యోగస్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న విజిలెన్స్ అధికారులపై మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలోని పూర్వ విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో యథాతథంగా అమల్లోకి వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం హైడ్రాలోని పనిచేస్తున్నారు. దీంతో తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని కమిషనర్ ఆమ్రపాలి పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.
అక్రమాలకు అడ్డాగా జీహెచ్ఎంసీ - కాగ్ నివేదికలో సంచలన విషయాలు - CAG report on GHMC corruption