Double bedroom houses Fraud in Hyderabad :రోజురోజుకూ మోసగాళ్లు వివిధ రకాలుగా మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామంటూ ఓ మహిళను మోసం చేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. నగరంలోని కొన్ని ముఠాలు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటూ దందా చేస్తున్నాయి. తాము జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులమంటూ చెప్పుకొంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చిలో ఇళ్లు రాని వారిని లక్ష్యంగా చేసుకుని వారి నుంచి ఆధార్, ఫొటో వంటి ఇతర వివరాలు తీసుకుని 15 రోజుల తర్వాత ఇంటి పత్రాలు ఇస్తామంటూ నమ్మబలికారు. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, ఇంటికే వచ్చి ఇస్తామంటూ వందల సంఖ్యల్లో నకిలీ పత్రాలు అంటగట్టారు. ఈ క్రమంలో బండ్లగూడ, కొల్లూరు ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలకు వెళ్లిన లబ్ధిదారులు, అక్కడ వారి పేర్లతో ఇళ్లు లేవని తెలుసుకున్నారు.
కొల్లూరు, బండ్లగూడలో ఇల్లు కేటాయింపు పత్రాలు (ETV Bharat) మోసం బయటపడిందిలా : గౌలిపురలో నివసిస్తున్న టి.లావణ్య అనే మహిళ ఇంటికి తొమ్మిది నెలల క్రితం ఇద్దరు యువతులు వచ్చారు. తాము జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్నామని, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తున్నామంటూ నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన లావణ్య అన్ని వివరాలను తెలిపారు. ఏప్రిల్ రెండో వారంలో మళ్లీ లబ్ధిదారురాలిని సంప్రదించిన యువతలు బండ్లగూడలో ఇల్లు వచ్చిందని పత్రాన్నిచ్చి ఫొటో తీసుకున్నారు. అనంతరం ఆమె నుంచి రూ.20 వేలు తీసుకున్నారు.
కొద్దిరోజుల తర్వాత పత్రాన్ని ఇచ్చిన యువతి కనిపించడంతో బండ్లగూడలో తాము ఉండలేమని, వేరే చోట కేటాయించాలని లావణ్య అభ్యర్థించారు. రెండ్రోజుల తర్వాత కొల్లూరులో ఇల్లు వచ్చిందంటూ పత్రాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో బండ్లగూడ తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించడంతో అవి నకిలీ పత్రాలని అధికారులు చెప్పారు.
ఇల్లు కేటాయింపు పత్రాలు (ETV Bharat) నకిలీ సంతకాలు - రబ్బర్ స్టాంపులు :డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పత్రాలు ఇస్తున్న ముఠా ఆర్డీవో సంతకం, రబ్బర్ స్టాంపులను నకిలీవి తయారు చేసి వాటిపై వేస్తున్నారు. పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, పీఎం ఆవాస్ యోజన లోగోను కూడా ముద్రించారు. కొన్ని పత్రాల్లో చేతిరాతలు మరికొన్నింట్లో పేర్లను నమోదు చేశారు. దీనిపై హైదరాబాద్ రెవెన్యూ అధికారి వెంకటాచారిని సంప్రదించగా, లావణ్యకు ఇచ్చిన పత్రాలు నకిలీవని, ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ చేపట్టినట్లు తెలిపారు.