Father Committed Suicide After Daughter Suicide Attempt : కుమార్తె అంటే ఆ తండ్రికి ఎంత ప్రేమో చెప్పడానికి ఆ తండ్రి చేసిన పనే సాక్ష్యం. తన గారాలపట్టి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉందనే విషయం తెలిసి ఆ తండ్రి గుండె విలవిలలాడింది. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తన బంగారు బొమ్మ చావు అంచుల్లో ఉండటం చూసిన ఆ తండ్రి హృదయం బద్ధలైంది. తన కుమార్తెకే ఎందుకు ఇలాంటి దీన స్థితి వచ్చిందనే మనస్తాపంతో, ఆమె బతుకుందో బతకదో అనే అనుక్షణం భయపడ్డాడు. తన ప్రాణం లేనిదే తాను ఈ లోకంలో ఉండలేనంటూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో గాజ కుమారస్వామి, రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమార్తె ఉంది. ఆ యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. గత ఏడాది ఇంటర్ ఫెయిల్ కావడంతో ఒక సంవత్సరం నుంచి ఇంటి వద్దనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది. ఈ సంవత్సరం పరీక్షల్లో కూడా ఆమె మళ్లీ ఫెయిల్ అయింది. పాస్ కాలేదనే మనస్తాపంతో ఆ యువతి ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.