Farmers Attack On Vikarabad Collector : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం లగచర్లలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో స్థానిక ప్రజలు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటుచేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్ ప్రతీక్‌జైన్ లగచర్ల గ్రామానికి చర్చల కోసం వెళ్లారు.
అయితే కలెక్టర్ ఊర్లోకి రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లు విసిరారు. కారు దిగి రైతులతో చర్చించేందుకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్ రైతులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పొయిన స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు తహశీల్దార్ కార్లపై రాళ్లు విసిరారు. పరిస్థితిని గమనించి అక్కడి నుంచి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగాల్సి వచ్చింది.
పోలీసులపైనా స్థానికులు దాడి :పరిస్థితిని ముందే ఊహించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులంతా గ్రామసభ జరిగే ప్రాంతంలో ఉన్నారు. దీంతో చర్చల కోసం వచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్ వద్ద తగినంత భద్రత లేకపోవడం గ్రామస్థులు దాడికి దిగడానికి పరిస్థితి అనుకూలంగా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని దుద్యాల మండలంలో 1,350 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఫార్మా కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 156 ఎకరాలే ఉంది. మిగిలిన భూమిని సేకరించాల్సి ఉంది. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు కారణం సదరు కాంగ్రెస్ నాయకుడే అంటూ ఆయన కారుపై రాళ్లు రువ్వి, అద్దాలను ధ్వంసం చేశారు. రక్షణగా వచ్చిన పోలీసులపైనా స్థానిక ప్రజలు తిరగబడ్డారు. పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీఛార్జి చేసి ప్రజలను చెదరగొట్టాల్సి వచ్చింది. రైతులు మాత్రం బంగారం లాంటి తమ భూములను ఔషధ కంపెనీకి ఇచ్చేదే లేదంటున్నారు. బలవంతంగా భూసేకరణ చేపడితే మాత్రం ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు.
నిశ్శబ్దం ఆవహిస్తోంది - ఖాళీ అవుతున్న కరవు సీమ