Many Farmers Are Suffering Due To Mistakes In Land Resurvey : గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వే ఇబ్బందులు రైతులను వెంటాడుతున్నాయి. అస్తవ్యస్తంగా సర్వే నిర్వహించడంతో అనేక మంది రైతులు 10 సెంట్ల నుంచి 30 సెంట్ల వరకు భూమిని కోల్పోయారు. పాత అడంగల్, పాస్ పుస్తకంలో భూ సరిహద్దులు ఉన్నా సర్వేలో తమ విస్తీర్ణం తగ్గిందని రైతులు వాపోతున్నారు. రీసర్వే తప్పుల తడకగా సాగుతోందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. జగనన్న భూ సర్వేలో నష్టపోయిన తమకు కూటమి సర్కారు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
రాష్ట్రంలో 1920 -1927 మధ్య భూముల సర్వే జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా విస్తీర్ణం 21లక్షల 26 వేల 799 ఎకరాలు కాగా 9.05 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు, 14.53 లక్షల ఎకరాలు ప్రైవేటు భూములు ఉన్నాయి. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూ సర్వే జరిపి భూములకు కొత్తగా పాసు పుస్తకాలు ఇస్తున్నామని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. భూ సర్వే గొప్ప విషయమంటూ ఆ పార్టీ నాయకులు అప్పట్లో ఊదరగొట్టారు. కానీ సర్వే తప్పుల తడకగా సాగింది.
జగన్ బొమ్మపై ఉన్న శ్రద్ధ వివరాలపై లేదాయె!- అన్నదాతకు తలనొప్పులు తెచ్చిన కొత్త పాస్‌పుస్తకాలు - Land Resurvey Problems
గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి నేటికీ రైతులు మూల్యం చెల్లిస్తున్నారు. కార్స్, డ్రోన్ విధానంలో సర్వే చేయగా కార్ పరిజ్ఞానంలో డిఫెరెన్స్ గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్ ద్వారా భూముల హద్దుల్లో తేడా లేకుండా ఉండేలా దీన్ని రూపకల్పన చేశారు. క్షేత్రస్థాయిలో రోవర్‌తో భూముల సరిహద్దులు గుర్తించి బేస్ స్టేషన్‌లకు అనుసంధానం చేశారు. సర్వేను పటిష్టంగా చేయాలని రైతులు మెత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హద్దులు మార్చి, వెతలు మిగిల్చి - భూముల 'రీసర్వే'తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు (ETV Bharat) ఒక్కో రైతుకి, ఒక్కో గ్రామానికి ఒక్కో సమస్య. కొంత మంది రైతులకు తమ పట్టాదారు పాసుపుస్తకంలో ఎక్కువ భూమి ఉంటే రీసర్వే తర్వాత తక్కువ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో సారి పట్టుబట్టి కొలిపిస్తే కొంత భూమి ఎక్కువగా చూపిస్తుందని మరికొంత మంది వాపోయారు. భూమి సరిగా కొలవకపోవడంతో కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తిన ఘటనలూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో భూమి అధికంగా ఉంటే దాని సరిహద్దు గ్రామంలో భూమి తక్కువగా చూపిస్తోందని జగనన్న భూహక్కు సర్వేకు సంబంధించి తాము గతంలో లెవనెత్తిన అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదని రైతులు చెబుతున్నారు.
ప్రజల సొమ్ము సర్వే రాళ్లపాలు- రూ.525 కోట్లు మంచినీళ్లలా వెచ్చించిన ఏపీఎండీసీ - LAND RESURVEY stones
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహిస్తోంది. రీ సర్వే ప్రాజెక్టు చేపట్టి భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. సర్వే పూర్తైన గ్రామాలకు గత ప్రభుత్వం పాసు పుస్తకాలను కూడా సక్రమంగా పంపిణీ చేయలేదు. రైతులకు సరిహద్దులూ చూపించలేదు. హద్దు రాళ్లు పాతలేదు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరి చేయాలని రైతులు కోరుతున్నారు.
జగనన్న భూ సర్వేలో పొలం కొలతల్లో కొంత తప్పులు జరిగాయని అధికారులు అంగీకరిస్తున్నారు. రైతులు తమకు వినతిపత్రాలు ఇస్తున్నారని వారు లెవనెత్తిన అంశాలను వారి సమక్షంలో రీ సర్వే చేసి పరిష్కరిస్తామని చెబుతున్నారు.
'మీకోదండం మాకొద్దు మేడం'- భూరక్ష పథకం అమలు కోసం అధికారుల తంటాలు