Farmers Happy over Grain Payments in AP:ధాన్యం సొమ్ములు చెల్లింపులపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములు ఖాతాలో పడతాయని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం తూ.చ తప్పకుండా అమలవుతోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో ధాన్యం డబ్బులు కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల నుంచి సొమ్ము జమ చేయడం వరకూ పక్కాగా అమలు చేస్తుండంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో 6,985 మంది రైతుల నుంచి ఇప్పటివరకు 46,310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యం విలువ రూ.103.78 కోట్లు వరకు ఉంటుంది. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.100.63 కోట్లు చెల్లించగా ఇంకా కేవలం రూ.3.15 కోట్లు మాత్రమే చెల్లించాలి. అంటే ఎంత వేగంగా రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుంది అర్థమవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో 24 గంటల్లో సొమ్ములు జమ అయినట్లు ఫోన్లకు మెస్సెజ్లు వస్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో ఇదే సమయానికి గతేడాది కేవలం 13000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ చేశారు. ప్రస్తుతం 3 రెట్లు ఎక్కువగా సేకరణ జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే రూ.674 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే రూ.637 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఓవైపు ఏ క్షణాన వర్షాలు వస్తాయో తెలియని పరిస్థితిలో ఆందోళన చెందుతున్న తమకు ప్రభుత్వం వేగంగా, నేరుగా కొనుగోలు చేయడం సంతృప్తినిచ్చిందని రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 21 రోజుల్లో చెల్లిస్తామని గడువు పెట్టింది. కానీ ఆ గడువు 60 రోజులు 90 రోజుల వరకు కొనసాగింది. ధాన్యం విక్రయించిన తర్వాత 90 రోజులకు కూడా సొమ్ములు అందేవి కావు.