ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు మార్కెట్లో ఉల్లి గుట్టలు - కిలో 15రూపాయలే! - తీవ్రంగా నష్టపోతున్న రైతులు - ONION SALES STALL IN KURNOOL MARKET

కర్నూలు ఉల్లి రైతులకు కష్టాలు - పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి అష్టకష్టాలు

farmers_facing_problems_onion_sales_stall_in_kurnool_market
farmers_facing_problems_onion_sales_stall_in_kurnool_market (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2024, 12:56 PM IST

Farmers Facing Problems Onion Sales Stall In Kurnool Market :ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి రైతన్నలను కన్నీరు పెట్టిస్తోంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నో ప్రయాసలుపడి సరుకును మార్కెట్​కు తీసుకెళ్తే కొనే నాథుడు లేక రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కర్నూలు ఉల్లి మార్కెట్లో టన్నుల కొద్దీ ఉల్లి పేరుకుపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు విపణికి ఎందుకు ఇంతలా ఉల్లి ఉత్పత్తులు వస్తున్నాయి? తరచూ ఎందుకు ఇలాంటి ఇబ్బందులు. అసలు సమస్య ఎక్కడుంది. ఏం చేస్తే ఇది పరిష్కారం అవుతుంది.

రాష్ట్ర వ్యవసాయ రంగంలో కష్టాలన్నీ ఉల్లి రైతులవే అన్నట్లు తయారైంది పరిస్థితి. కష్టపడి పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్‌కు తెచ్చి అమ్ముకోవడం మరో ఎత్తు అన్నట్లు ఉంది. మొన్నటి వరకు అధిక ధరలతో వినియోగదారుడికి కన్నీరు తెప్పించిన ఉల్లి అమ్ముకునేందుకు ఏర్పడుతున్న కష్టాలతో ఇప్పుడు రైతును ఏడిపిస్తోంది. కర్నూలు ఉల్లి మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది కర్నూలు వ్యవసాయ విపణికి ఉల్లి పోటెత్తుతోంది. గత నెల రోజులుగా ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వరుస కట్టారు. నిత్యం రికార్డు స్థాయిలో 22 వేల క్వింటాళ్ల వరకు సరుకు వస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకును సకాలంలో బయటకు తరలించకపోవటంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఉల్లి గుట్టలు ఖాళీ చేసిన తర్వాతనే సరకును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీంతో మిగతా రైతులంతా నిరీక్షించాల్సి వస్తోంది.

ఉల్లి కొనుగోళ్లకు కర్నూలు మార్కెట్‌ ప్రసిద్ధి. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు సహా అనంతపురం, తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రైతులు సరకు తీసుకొస్తుంటారు. ఈ సీజన్‌లో ఆగస్టు నుంచి విక్రయాలు ప్రారంభయ్యాయి. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులంతా మార్కెట్‌కు వరుస కట్టారు. గత 3రోజుల వ్యవధిలో 67,500 క్వింటాళ్లు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత సరుకు వస్తున్నా మార్కెట్లో చోటు లేకపోవటంతో కొందరు రైతులు తమ పంటను ఇంటికి తీసుకెళ్తున్నారు. తాడేపల్లిగూడెంలోని ఉల్లి మార్కెట్‌కు తరలించాలని భావిస్తున్నా అక్కడ కూడా ధరలు తక్కువగా ఉండటం, రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు.

ఈ-నామ్‌ విధానం అమలవుతున్న విపణుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గత వారం వ్యవధిలో అంటే ఈనెల 21 నుంచి 26 వరకు ఆరు రోజులపాటు సాంకేతిక సమస్య తలెత్తటంతో ఈ నామ్ విధానంలో కొనుగోళ్లు ఆగిపోయాయి. గత వారం చివర్లో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేశారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి ధర ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరిగింది. గతంలో ఇంతకంటే అధిక మొత్తంలో అన్నిరకాల పంట ఉత్పత్తులు వచ్చిన సమయంలోనూ ఏనాడు మార్కెట్‌లో క్రయవిక్రయాలు ఆపేసిన దాఖలాలు లేవు. మార్కెట్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వ్యాపారులు, రైతులను సమన్వయం చేసుకోకపోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఉల్లికి కుళ్లిపోయే గుణం ఎక్కువ. ఎప్పటికప్పుడు గ్రేడింగ్‌ చేయాలి. అలా చేస్తేనే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్‌ చేయించుకోవడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రోజువారీ వ్యాపారాలు జరగకపోవడంతో తరుగు పేరుతో 5 నుంచి 10 క్వింటాళ్ల సరుకు పారబోయాల్సి వస్తోంది. గ్రేడింగ్ చేసినందుకు కూలీలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. నాలుగైదు రోజులైనా ఉల్లి కొనుగోళ్లు జరగకపోవటంతో మార్కెట్‌లో పడిగాపులు కాయడం సహా భోజనాలకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

నిలిచిన ఉల్లి విక్రయాలు- మార్కెట్ ఎదుట అన్నదాతల జాగారం

కొనుగోళ్లు సక్రమంగా లేక కర్నూలు వ్యవసాయ విపణిలో ఉల్లి నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. వ్యాపారులు కొనుగోలు చేసిన సరకు మార్కెట్‌ నుంచి బయటకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కర్నూలు నుంచి కోల్‌కతా, తమిళనాడు, కేరళ, కటక్, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. లారీలు దొరక్కపోవడంతో లోడింగ్‌లో జాప్యం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వివిధ షెడ్లలో కలిపి సుమారు 6 వేల టన్నుల మేర పేరుకుపోయాయి.

కర్నూలు ఉల్లి మార్కెట్‌లో కొనుగోళ్ల సమస్య ఓ వైపు వేధిస్తూ ఉంటే దళారులు మరో ఇబ్బందిగా మారారు. దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్‌లోనే గ్రేడింగ్‌ చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లోకి దళారులు, అనుమతి లేని వ్యాపారులను రానీయకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులకు నష్టం జరుగుతున్నా మార్కెట్‌ ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు నోరు మెదపడం లేదు. మార్కెట్‌కు ఆదాయం రాకున్నా పర్వాలేదు దళారులు, వ్యాపారులకు మేలు జరిగితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో అనధికారిక వ్యాపారాలు చేయకూడదు. పంటను ఈనామ్ విధానంలో కొనుగోలు చేయాలి. సర్వర్ పనిచేయకపోవటంతో రెండు రోజులు టెండర్ విధానంలో కొనుగోలు చేశారు. కానీ కొందరు వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుల నుంచి పెద్దఎత్తున అనధికారిక విక్రయాలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సరాసరిన ఉల్లి కిలో 50 రూపాయలు పలుకుతుండగా రైతుల నుంచి క్వింటా 1000 నుంచి 15 వందలకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో ఉల్లిని అత్యధికంగా 15 రూపాయలకు కొంటున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి పంటను సాగు చేస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 87వేల500 ఎకరాలు. ఏటా సరాసరిన 5.25 లక్షల టన్నుల ఉల్లి దిగుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గినా బోర్లు, బావులు, కాల్వల కింద సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఖరీఫ్ సీజన్​లో45 వేల ఎకరాల్లో ఉల్లిని సాగు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ మధ్య తరచుగా వర్షాలు కురవటంతో ఉల్లి కోతలు కోయలేదు. ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొనటంతో రైతులు ఉల్లిని కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు.

ఏటికేడు ఉల్లి సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా ఒక ఎకరా విస్తీర్ణంలో ఉల్లిని సాగు చేయాలంటే ఎకరాకు 80 వేల వరకు ఖర్చు వస్తోంది. ఖరీఫ్ ఆరంభంలో లోటు వర్షపాతం నమోదు కావటం ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు కనీసం వంద క్వింటాళ్ల దిగుబడులు రావాల్సి ఉండగా 50 నుంచి 60 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. పెట్టుబడులు పెరిగినా దిగుబడులు తగ్గినా మార్కెట్‌లో మంచి ధరలు ఉండటంతో గిట్టుబాటు ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి.

మహారాష్ట్రలో జూలై చివర్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలోనూ ఉల్లి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ గత కొంతకాలంగా వర్షాల కారణంగా కోతలు కోయకపోవటంతో బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. రైతు బజార్లలో కిలో ఉల్లి 40 నుంచి 60 రూపాయల వరకు పలుకుతుండగా బహిరంగ మార్కెట్​లో 80 రూపాయల వరకు పలుకుతోంది. కర్నూలు మార్కెట్లో మాత్రం క్వింటా ఉల్లి ధర గరిష్ఠంగా 4,600 రూపాయలు కనిష్ఠంగా 4 వందల రూపాయలు పలుకుతోంది. సరాసరిన వెయ్యి నుంచి 15 వందల వరకు పలుకుతోంది. ఇలాంటి ధరల వల్ల రైతన్నలకు తీవ్రమైన నష్టాలు వస్తాయి. కనీసం క్వింటా ఉల్లి సరాసరిన 2 వేలు పలికితే రైతన్నకు గిట్టుబాటు అవుతుంది.

ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులకు మేలు జరిగేలా చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దళారులు, వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లలో సమస్యల నేపథ్యంలో సోమవారం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సమస్య కొంత వరకు పరిష్కారమైనా తరచూ ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. దళారుల జోక్యాన్ని నివారించడం సహా గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తగ్గిన ఉల్లి దిగుబడి - ధరలు పైపైకి - అయినా రైతన్నకు తప్పని నష్టాలు - Onion Crop Damage in Kurnool

ABOUT THE AUTHOR

...view details